తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో గత ఐదేళ్లలో అసెంబ్లీ అంటే… అత్యంత ఘోరమైన బూతుల కేంద్రంగా మారింది. కేవలం ఇరవై అంటే ఇరవై మంది ఉన్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడానికి వారి కుటుంబాలపైనే బూతులు మాట్లాడి.. దాడులు చేసి.. రచ్చ చేసి.. సస్పెండ్ చేసే అధికార పార్టీ.. ఏ ఒక్క చర్చనూ సక్రమంగా సాగనీయలేదు. చివరికి అసెంబ్లీకి విలువ లేదని చివరి రోజునే తేలిపోయింది.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోనూ ఇంతే ఉండేది. . విపక్ష సభ్యులను సస్పెండ్ చేసేసి సభను నిర్వహించేవారు. అప్పటికే విపక్ష నేతలందర్నీ కొనుగోలు చేసేసి ఉంటారు కాబట్టి.. సస్పెండ్ చేయడానికి డబుల్ డిజిట్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా అవసరం ఉండేది కాదు. అలాంటి ఏకపక్ష అసెంబ్లీ నుంచి ఇప్పుడు ప్రజాస్వామ్య అసెంబ్లీ దిశగా నడుస్తోంది. అసెంబ్లీలో చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. నిరసనలు దాదాపుగా లేవు. బీఆర్ఎస్ సభ్యులు కూడా మైక్ కోసం చూస్తున్నారు కానీ.. సభను అడ్డుకోవాలనుకోవడం లేదు. అడ్డుకుంటే.. తమ వాదన వినిపించే అవకాశం లేకుండా ప్రభుత్వం సభలో ప్రకటనలు చేస్తుందని వారు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేది చట్టాలు చేయడానికే. దందాలు చేసుకోవడానికి కాదు. చట్టాలు చేసే ముందు క్షణ్ణంగా చర్చించాల్సి ఉంటుంది. అలాంటి చర్చల కోసమే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. కానీ రాను రాను అసలు పని మానేసిన ఎమ్మెల్యేలు దందాలు చేసుకుంటున్నారు. ప్రజా సేవ పేరుతో దందాలు చేసినా అసెంబ్లీలో చర్చలు అయినా జరిగితే చాలా విషయాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడా అవకాశం కనిపిస్తోంది.