కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్ ను నిషేధిస్తే ఇండియాలో ఎందుకు అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తోంది.
వ్యాక్సిన్ తో పెద్ద ఎత్తున బిజినెస్ చేశారని, తద్వారా బీజేపీకి మేలు కలిగేలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను బీజేపీకి ఇచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది. కరోనా సమయంలో మానవ మరణాలను నిలువరించేందుకే కోవిషీల్డ్ కు అనుమతులు ఇస్తే…సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఎందుకు ఇచ్చిందనేది చర్చనీయాంశం అవుతోంది.
ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్ వలన దుష్ప్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేసినా అప్పట్లో కేంద్రంలోని బీజేపీ అనుమతులు ఇవ్వడం క్విడ్ ప్రోకో అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోవిషీల్డ్ రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా అంగీకరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దుష్ప్రభావాలు ఉంటాయని తెలిసినా టీకాకు అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది.
భారతీయులకు ఉచిత వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ విడుదల చేసిన నాటి పోస్టర్లపై కాంగ్రెస్ నేత బీఎస్ శ్రీనివాస్ తాజాగా వ్యంగ్యంగా స్పందించారు. “ధన్యవాదాలు మోదీ జీ బ్యానర్ ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు.ఈ విషయంపై ప్రధాని మౌనం వహించడాన్ని ఆయన ఆక్షేపించారు.
“ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు, ప్రజల జీవితానికి సంబంధించినది.లోపాలు ఉన్న వ్యాక్సిన్‌ను తీసుకున్న ప్రధాని సమాధానం చెప్పాలి. ఎందుకంటే భారతదేశ జనాభాలో సగానికి పైగా ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ను తీసుకున్నారని తెలిపారు. పౌరుల ప్రాణాల కన్నా రాజకీయాలకే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడుతున్నారు.