బీఆర్ఎస్ఎల్పీ విలీనమన్నంతగా షో చేశారు కాంగ్రెస్ నేతలు. తుక్కుగూడ సభలో పాతిక మందిని చేర్చుకుని బీఆర్ఎస్ ను తుక్కు తుక్కు చేస్తామని ప్రకటించారు. తీరా చూస్తే ఒక్కరు కూడా చేరలేదు. తర్వాతి రోజు.. ఒక్క తెల్లం వెంకట్రావును తెచ్చి రేవంత్ రెడ్డితో కండువా కప్పించారు. మీడియాకు గొప్పగా సమాచారం పంపించారు.
నిజానికికి తెల్లం వెంకట్రావు ఫలితాలు వచ్చిన రోజునే కాంగ్రెస్ క్యాంపులోకి వచ్చారు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని ఎవరూ అనుకోవడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఆయన.. మొదట కాంగ్రెస్ లో చేరారు. టిక్కెట్ రాదని తెలియడం.. ఆయనపై సానుభూతి ఉండటంతో కసీఆర్ పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. ప్రతీ సారి ఖమ్మంలో బీఆర్ఎస్ ఒక్కటే గెలుస్తూ వస్తోంది. ఈ సారి కూడా భద్రచలం ఒక్కటే గెలిచింది. పార్టీ గెలవకపోవడం వల్ల వెంకట్రావు కూడా ఫలితాలొచ్చిన రోజునే జెండా తిప్పేశారు.
ఇప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. దానం నాగేందర్, కడియం శ్రీహరిలను చేర్చుకున్నారంటే.. లోక్ సభ టిక్కెట్ల ఇష్యూ ఉందనుకోవచ్చు. మరి వెంకట్రావును ఎందుకు హడావుడిగా చేర్చుకున్నారో. తమతో టచ్లో చాలా మంది ఉన్నారంటున్నారు కాబట్టి.. వారందరితో కలిసి ఒక్క సారి కండువా కప్పి ఉండవచ్చు కదా అనేది చాలా మంది వస్తున్న డౌట్.