ఈ మధ్య విడుదలయిన ఒక తెలుగు సినిమాలో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గురించి హీరో వర్ణిస్తూ అటువంటి అమ్మాయిని ‘లవ్ చేయాలా వద్దా..’అని మదనపడిపోతూ ఓ పాట పాడుకొంటాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలకి కూడా అటువంటి ధర్మసందేహమే కలిగిందిట! అదేమిటంటే ఆ హీరోయిన్ లాగే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ గా పేరొందిన జగన్మోహన్ రెడ్డితో మనం చేతులు కలుపుతున్నామా లేదా? అని ట!
ప్రత్యేక హోదా, కాపులకు రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనక్కి తగ్గి వైకాపాయే లీడ్ తీసుకొనేందుకు అవకాశం కల్పించి ఆ పార్టీకి చేతులు కలపడానికి ఇంటరెస్టుగా ఉన్నామని చాలా క్లియర్ సిగ్నల్స్ ఇచ్చింది. కనుక ఆ పార్టీ మనకి మున్ముందు దగ్గరవుతామా లేక దానిని కూడా తెదేపాతో సమానంగా శత్రువులాగ ట్రీట్ చేయాలా? అని ఏపి కాంగ్రెస్ నేతలకి ఒక గొప్ప ధర్మ సందేహం కలిగింది.
ఈరోజు విజయవాడకి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్ ని వారు అదే ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆయన వద్ద కూడా సరయిన సమాధానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పంపుతున్న గ్రీన్ సిగ్నల్స్ ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ‘కనుక ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని బలపరుచుకోవడమే మన ముందున్న కర్తవ్యం,’ అని దిగ్విజయ సింగ్ పార్టీ నేతలకి హితబోధ చేసారుట! అయితే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకోనప్పుడు దానిని మరేవిధంగా బలపరుచుకోవాలో కూడా ఆయన చెప్పలేదు కానీ బలపరుచుకోవడానికి ఇప్పుడు చాలా గొప్ప అవకాశం ఉందని దానికో మంచి కారణం చెప్పారుట! అదేమిటంటే తెదేపా-వైకాపాల మధ్య ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడిఉందిట… దానిని చక్కగా వినియోగించుకొంటే చాలా వీజీగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడవచ్చునని దిగ్విజయ సింగ్ వారు తమ అనుగ్రహ సంభాషణలో కాంగ్రెస్ నేతలకు తెలియజేసారుట!
దిగ్విజయ సింగ్ వారికి కనబడిన ఆ రాజకీయ శూన్యత మరి కాంగ్రెస్ జీవులకి కూడా కనబడిందో లేదో తెలియదు కానీ ప్రజాధారణ లేనప్పుడు రాజకీయాలలో అంతా శూన్యమే కనిపిస్తోందని పార్టీలో మిగిలినవారు చెప్పుకొంటున్నారుట!