ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకబడింది. ఒక్క రాష్ట్రంతోనే సరి పెట్టుకుంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లలో కాంగ్రెస్ కు కనిపించినట్లుగా… . హిందీ రాష్ట్రాల్లో కనిపించలేదు. ఆలాంటి నాయకత్వాన్ని అటు రాహుల్ కానీ ఇటు ఆయా రాష్ట్రాల నేతలు కానీ ప్రజలకు చూపించలేకపోయారు.
పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ అది బయటకు రావాలంటే బలమైన ప్రత్యామ్నాయం కావాలి. అలాంటి ప్రత్యామ్నాయం చూపించడానికి ఇండియా కూటమి ఏర్పాటైంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు దాదాపు 24 విపక్ష పార్టీలు కలిసి I.N.D.I.A కూటమి ఏర్పాటు చేశాయి. వీటిలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరింత డీలా పడినట్లయింది.
దేశంలో దక్షిణాదిన బీజేపీ ఉనికి లేదు. ఆ పార్టీ దక్షిణాదిలో చేస్తున్న ప్రయోగాలు వికటించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్లమెంట్ పై ఆశలు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే. దక్షిణాదిలో ఇక ఆ పార్టీకి ఎలాంటి ఆశలు లేవు. ప్రాంతీయ పార్టీలు కలసి వస్తాయి కానీ.. ఎప్పుడంటే.. బీజేపీ పూర్తి మెజార్టీ ఉన్నప్పుడే.
తాజా ఫలితాలతో బీజేపీకి హిందీబెల్ట్ లో తన పట్టు తగ్గలేదని నిరూపించుకుంది. గత రెండు సార్లు హిందీబెల్ట్ లో 90 శాతానికిపైగా ఫలితాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలు… బీసీ జనగణనలు అన్నీ తేలిపోతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఈ ఫలితాలు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయి. సెమీస్ లో ఓడిపోయారు. అంటే.. మరోసారి ఢిల్లీలో అధికారానికి దూరం కావాల్సిందేనేమో ?