దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యతిరేకత పెరిగిపోతోంది. మోదీ వ్యతిరేకత కారణంగా జట్టుకట్టిన ప్రాంతీయ పార్టీలకు అనూహ్యమైన మైలేజ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న సూచనలు కనిపిస్తున్నాయి కానీ.. అది బీజేపీని ఢీకొట్టి గెలిచేటంత కాదు. వచ్చే ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్ని ప్రాంతీయ పార్టీలే శాసించబోతున్నాయన్న విషయంపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. అందుకే కాంగ్రెస్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు… అటు ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవడం.. ఇటు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా… తాము పోటీ పడే స్థానాలను తగ్గించుకోవడానికి సిద్ధపడింది.
2019 లోక్సభ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత తక్కువ స్థానాల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతృత్వంలో కూటమితో చేరే పార్టీలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్తో కూటమిలో చేరకపోయినా… కాంగ్రెస్కు దగ్గరగానే వ్యవహరిస్తున్నాయి. కూటమిలో వచ్చే పార్టీలతో పాటు… స్థానిక రాజకీయాల కారణంగా తమకు అనుకూలంగా ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెట్టకూడదన్న యోచన చేస్తున్నారు. 542 స్థానాలున్న లోక్సభలో ఈ సారి కాంగ్రెస్ 250 లోక్సభ స్థానాల నుంచి మాత్రమే పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే రూపొందినట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.
2019 లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై ఏ కే ఆంటోనీ నేతృత్వంలో ఓ కమిటీ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ చేయబోయే ప్రధాన సిఫారసు ఇదేనంటున్నారు. 250 స్థానాలకు పోటీ చేస్తే.. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోతే… మిత్రపక్షాల ప్రభుత్వమే ఏర్పడుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాగా బలహీనపడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మాత్రమే ప్రధాన పార్టీగా ముఖాముఖి తలపడే పరిస్థితుల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో అన్ని సీట్లు కలిపినా… 250కు అటూ ఇటుగానే ఉంటాయి. అంటే కాంగ్రెస్ .. కేవలం తమకు బలం ఉన్న చోటే పోటీ చేయాలని నిర్ణయించుకుందని భావించొచ్చు. అది ప్రాంతీయ పార్టీలకు బాగానే మేలు చేస్తుంది.