ఒక విషాద ఘటనతో రాజకీయాల రూపురేఖలే మారిపోయాయి. వరంగల్ ఉప ఎన్నికల ఘట్టంలో కాంగ్రెస్ కు ఊహంచని ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ముందు ప్రకటించిన అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమైన విషాదకర ఘటన సంచలనం కలిగించింది. అవి హత్యలే అని రాజయ్య కోడలి తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో రాజయ్యసహా ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు.
ఈ అనూహ్య ఘటనతో షాక్ కు గురైన కాంగ్రెస్, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సర్వే సత్యనారాయణను బరిలోకి దింపింది. ఆయన ఆగమేఘాలమీద వరంగల్ కు వెళ్లారు. నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని నిమిషాల ముందు చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. రాజయ్య కుటుంబంపై వచ్చిన ఆరోపణల ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాల మీద పడుతుందేమో అని ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు.
సర్వే సత్యనారాయణ అనూహ్యంగా తెరపైకి వచ్చినా, ఆయన ఎవరో వరంగల్ ప్రజలకు పెద్దగా తెలియదు. ముందు అభ్యర్థిని పరిచయడం చేయాలి. పైగా రాజయ్య ఉదంతంతో కేడర్ లోనూ ప్రచారంపై ఉత్సాహం తగ్గే అవకాశం ఉంది. ఇదంతా తెరాసకు మేలే చేసేలా ఉందని అప్పుడే కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదయాకర్ ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా కేసీఆర్ తన రాజకీయ చతురతను చాటుకున్నారు. ఇక బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా దేవయ్య పోటీ పడుతున్నారు. ఆయన కూడా సామాన్య ఓటర్లకు పరిచయం లేని వ్యక్తి. అయితే ఆర్థికంగా బలవంతుడని టికెట్ ఇచ్చినట్టు చెప్తున్నారు.
వరంగల్ లో తెరాస జోరు మీదుంది. ఆదివారమే భారీ సభతో ప్రచారం షురూ చేసింది. మంత్రులందరూ ఇక ఈ ఉప ఎన్నిక మీదే ఫోకస్ చేస్తారు. కేడర్ పుష్కలంగా ఉంది. పార్టీయే ఖర్చు భరిస్తుంది కాబట్టి ఆ లోటు కూడా లేదు. దీంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. మామూలుగానే తమ పార్టీ గెలిచేదని, ఇప్పుడు రాజయ్య ఉదంతంతో మరింత సులువుగా గెలుస్తామని తెరాస శ్రేణులు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అనూహ్య పరిణామం నుంచి ఎంత తేరుకుంటుందో, ఏ స్థాయిలో పోటీ పడుతుందో చూడాలి. బీజేపీకి పెద్దగా కేడర్ లేకపోయినా తెలుగు తమ్ముళ్ల అండ ఉంది. కాబట్టి పోటీ ఆసక్తికరంగానే ఉండొచ్చు. అయినా గులాబీ శ్రేణుల ధీమా మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.