”జుట్టు పట్టుకుని బయట కీడ్చినా.. చూరు పట్టుకుని వేళ్లాడీ… దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచే వారికి భలే చాన్సులే…” అంటూ మన సినీకవిగారు దశాబ్దాల కిందటే జీవితసత్యాన్ని చాలా సులువైన భాషలో తెలియజెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్న తీరును గమనించినప్పుడు కూడా ఈ జీవిత సత్యం నిజమే అనిపిస్తోంది.
పవన్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీని చెడతిడుతూ ఉంటారు. ఇది కొత్తగా నేర్చుకున్న తిట్లు కూడా కాదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే.. ప్రత్యేకించి వైఎస్సార్‌ను ఉద్దేశించి.. ఈ కాంగ్రెస్ నాయకుల్ని పంచెలూడదీసి తరిమికొట్టాలంటూ ఆవేశపూరితంగా పిలుపు ఇచ్చి సంచలనం సృష్టించిన వ్యక్తి పవన్ కల్యాణ్. తాను రాజకీయాలు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్‌ను తూలనాడడానికి కూడా కాస్త సమయం కేటాయిస్తారు.
అలాంటి పవన్ కల్యాణ్ తాను క్రియాశీలంగా రాజకీయాలు ప్రారంభించబోతున్నా అనే సరికి… ఆయన ప్రజాసమస్యలపై పోరాడుతాం అంటే.. తాము మద్దతు ఇస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తున్నది. ఆయన తిట్లను పట్టించుకోకుండా.. పవన్ కల్యాణ్ అనే పేరు చుట్టూ ఉన్న క్రేజ్‌ను తాము కూడా ఎంతో కొంత దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకుడు మాదాసు గంగాధరం మాట్లాడుతూ.. పవన్ ప్రజాపోరాటాలు చేస్తే.. వెంటనిలవడానికి తాము సిద్ధం అని సెలవిచ్చారు.
అయితే ఇప్పటిదాకా పవన్ ప్రజాపోరాటాలుచేస్తా అని కూడా చెప్పలేదు. మరి ఆయన పోరాటాలు చేయడం లేదని వీరు చెప్పదలచుకున్నారో లేదా, నిజంగానే మద్దతు ఇస్తున్నారో తెలియదు. అయితే.. కేవలం కాంగ్రెస్‌పార్టీ ఎంపీగాఉన్నందుకు తాను అన్ని విషయాల్లో దేవుడుగా భావించే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తన జనసేన పార్టీ లోకి మాత్రం ఎంట్రీ ఉండదని స్పష్టంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ ఈ కాంగ్రెస్ వారి పసలేని ఆఫర్‌ను అందుకుంటాడా అనేది ప్రశ్న. అయినా కాంగ్రెస్ పార్టీకి గనుక అంత చిత్తశుద్ధే ఉంటే.. పవన్ పోరాటాలకే మద్దతివ్వాలా.. తమంతగా తాము పోరాటాలు చేయలేరా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.