కర్నూలులో రాహుల్ గాంధీకి సభను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యూహం ఫలించిందనే చెప్పాలి. ఏపీలో కాంగ్రెస్ కు ఊపిరి లేదని అందరూ భావిస్తున్న తరుణంలో.. రాయలసీమలో… పార్టీ ఉనికి ఉందని… రాహుల్ సభ నిరూపించినట్లయింది. సభకు … సంతృప్తికర స్థాయిలో జనసమీకరణ చేయడంలో కోట్ల, బైరెడ్డితో పాటు ఇతర నేతలు కూడా సక్సెస్ అయ్యారు. రాహుల్ సభతో కాస్తో కూస్తో ఊపు వస్తుందని.. ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రత్యేకహోదా విషయంలో రాహుల్ గాంధీ స్పష్టమైన భరోసా ఇచ్చాక నమ్మకం చిక్కిందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు చేరిన తర్వాత … కాంగ్రెస్ కు ఇంత కాలం అండగా నిలబడిన సామాజికవర్గంలో తమకు ఆదరణ పెరుగుతుందన్న అంచనాలను ఆ పార్టీ నేతలు వేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గమ్యమూ కనిపించడం లేదు. ఏ వర్గం ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు లేదు. దూరమైన ఓటు బ్యాంకుల్ని దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. దీనికి ప్రత్యేకహోదా అంశం ఉపయోగపడుతోంది. కిరణ్, బైరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆ తరువాత వైసీపీపై దాడిని తీవ్రం చేస్తూండటంతో …రాజకీయంగా కొంత సమీకరణాలు మారే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంత మంది బలమైన నేతలు చేరడంతో వారితో పాటు క్యాడర్ కూడా.. కాంగ్రెస్ వైపు చూస్తోంది. ఒక్క సారి కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న భావన ప్రజల్లోకి వస్తే పాత క్యాడర్ అంతా మళ్లీ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవడం ఖాయమే . కాంగ్రెస్ పార్టీ బలపడటం ప్రారంభిస్తే.. ఆ పార్టీకి మొదటి నుంచి ఓటు బ్యాంక్ గా ఉన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ విషయంలో వైసీపీ మెతక వైఖరితో ఉండటంతో ఈ వర్గాలు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నాయన్న ప్రచారం ఉంది. పైగా జగన్ తో సహా వైసీపీ నేతల వ్యవహారశైలి… వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మింగుడు పడేలా లేదు. ప్రత్యామ్నాయం లేకనే వాళ్లు వైసీపీలో ఉండిపోతున్నారు. కాంగ్రెస్ పుంజుకుటుందని.. కర్నూలు సభతో కాస్తంత నమ్మకం కలిగించారు కాబట్టి.. ఇక పరిస్థితులు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభలో కాంగ్రెస్ నేతలు వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించి తమ ఉద్దేశాన్ని నేరుగానే చెప్పారు.
రాయలసీమలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో అనంతపురం మినహా మిగతా జిల్లాల్లో పట్టు నిరూపించుకుంది. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి తారుమరయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. చేరికలు, ప్రత్యేకహోదా నినాదాలతో.. కనీసం ఐదు శాతం ఓట్లు చీల్చుకున్నా.. ఆ మాత్రం. వైసీపీకి మైనస్ అవుతాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ వ్యూహం గెలవడం కాకపోవచ్చు. వైసీపీ బలహీనపడితేనే తాము బలపడతామని కాంగ్రెస్ కు బాగా తెలుసు. అందుకే తాము బలపడి.. వైసీపీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కర్నూలు సభతో ఓ అడుగు ముందుకేసినట్లే..