కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి, ఆ తరువాత తెరాస తీర్థం పుచ్చుకున్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెరాస తరఫున నల్గొండ ఎంపీగా బరిలో ఆయన దిగితే, ఓడించి తీరాలన్న వ్యూహాలతో ఉంది. మంత్రి పదవి, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు వస్తాయన్న ఆశతోనే గుత్తా తెరాసలో చేరారనేది బాగా ప్రచారంలో ఉన్న మాటే. అయితే, ఆయన ఆశించినవేవీ తెరాసలో దక్కకపోవడంతో గుత్తా ఆ మధ్య కొంత కినుకు వహించారు! కానీ, రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవిని ఆయనకి కేసీఆర్ సర్కారు కట్టబెట్టింది. దీంతో కొంత సంతృప్తి చెందారు.
కానీ, వచ్చే ఎన్నికల విషయమై ఆయనకి కొంత టెన్షన్ ఇప్పట్నుంచే మొదలైనట్టు సమాచారం! నల్గొండ ఎంపీగా తెరాస నుంచి బరిలోకి దిగినా… కాంగ్రెస్ నుంచీ తీవ్ర వ్యతిరేకత తప్పదని ఆయనకి భావిస్తున్నారట. ఎందుకంటే, కాంగ్రెస్ లో ఇప్పటికే దీనిపై కొంత చర్చ జరిగిందనీ, మరీ ముఖ్యంగా గుత్తా రాజకీయ గురువు జానారెడ్డి కూడా గుత్తాపై గుర్రుగా ఉన్నారనీ… తెరాస తరఫున ఎంపీగా గుత్తా బరిలోకి దిగితే ఆయన ఓటమికి శక్తివంచన లేకుండా కృషి చేయాలంటూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ విషయం గుత్తాకి తెలియడంతో… ఈసారి ఆయన నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. తనతోపాటు తెరాసలోకి కొంతమంది నేతలు వచ్చి చేరినా… ఎంపీగా గెలవాలంటే ఆ మద్దతు సరిపోదనే అంచనాకి ఆయనా వచ్చారట!
అందుకే, ఈసారి ఎంపీ స్థానం వద్దనీ, ఎమ్మెల్యేగా మిర్యాలగూడ నుంచి బరిలోకి దిగుతా అంటూ అనుచరులకు ఆయన చెప్పినట్టు సమాచారం! ఎమ్మెల్యే అయితేనే తనకు వచ్చే ఎన్నికల తరువాత మంత్రి పదవి వస్తుందని అంచనా వేస్తున్నారట! అయితే, మిర్యాలగూడలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నల్లమోతు భాస్కరరావు ఊరకుంటారా అనేదే ప్రశ్న..? సిట్టింగులందరికీ సీట్లు పక్కా అని కేసీఆర్ ఇప్పటికే ఒకటికి రెండుసార్లు ప్రకటించారు. నల్లమోతును తప్పించి, గుత్తాకి ఎమ్మెల్యే సీటు ఇచ్చే పరిస్థితి ఉంటుందా, ఉంటే నల్లమోతు గుత్తాకి మద్దతు ఇస్తారా అనే అనుమానాలూ ఉన్నాయి. మొత్తానికి, కాంగ్రెస్ వ్యూహం ఆయన్ని కంగారు పెడుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎంపీగా ఆయన పోటీ చేస్తే ఓడించి తీరతామంటూ నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలు పట్టుదలతో ఉండటంతో… వచ్చే ఎన్నికల్లో తెరాస నుంచి ఎక్కడ బరిలోకి దిగాలనేది గుత్తాకి ప్రశ్నార్థకంగా మారిందని ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.