కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం విషయంలో అధికార పార్టీ దూకుడు మరింత పెంచింది. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. రెండు రోజుల కిందట బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకోగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ చేరికల స్పీడ్ చూస్తుంటే కాంగ్రెస్ నిర్దేశించుకున్నట్టుగా అసెంబ్లీ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియను కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి గులాబీ పార్టీ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈమేరకు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. కానీ, చేరికల విషయంలో దూకుడు లేకపోవడం… అసెంబ్లీ సమావేశాలకు సమయం సమీపిస్తుండటంతో స్వయంగా రేవంత్ రెడ్డే రంగంలోకి దిగారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డితో స్టార్ట్ చేసిన రేవంత్ తర్వాత వెంటనే బీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితంగా ఉండే మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. చేరికల విషయంలో రేవంత్ పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానంకు అత్యంత సన్నిహిత నేతలను మొదట కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునే పనిలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
తద్వారా బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయవచ్చు అనే వ్యూహంతో చేరికల విషయంలో రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం టాస్క్ ను కాంగ్రెస్ కంప్లీట్ చేసి, కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది.