తెలంగాణలో.. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ..మహాకూటమి ఫార్ములాను రెడీ చేశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఇక్కడి నేతలకు సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు నివేదికలను సిద్దం చేసుకుని కొప్పుల రాజు వంటి వారితో .. మిషన్ తెలంగాణను ఎప్పటి నుండో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ.. మహాకూటమి విషయంలోనూ క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమిలాగే పోటీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిశానిర్దేశం చేశారు. కూటమిలో సీట్లు విషయంలోనూ.. ఏఐసిసి బృందం ఆయా పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. దీని ప్రకారం.. 25 నుంచి 29 సీట్లు ఆయా పార్టీలకు ఇవ్వనున్నట్లు.. రాహుల్ గాంధీ.. ఉత్తమ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
మహాకూటమిలో తెలుగుదేశం పార్టీకి పదిహేను, కోదండరాం తెలంగాణ జనసమితికి ఆరు, సీపీఐకు నాలుగు. మిగతా చిన్నపార్టీలకు.. ఒకటి రెండ సీట్లు కేటాయించనున్నారు. క్షేత్ర స్థాయిలో… పార్టీల నేతల మధ్య ఇప్పటికీ సీట్ల కేటాయింపుపై చర్చలు ఇంత వరకూ జరగలేదు కానీ.. రాహుల్ మాత్రం పక్కా ప్రణాళికతోనే… వ్యవహారాలను చక్క బెట్టారన్న ప్రచారం జరుగుతోంది. కూటమిలో ఏఏ పార్టీలు ఉంటాయి.. వారికి ఇచ్చే సీట్లు ఎన్ని..? స్థానాలు ఏవి అన్నదానిపైనా.. ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. అందుకే ఉప్పల్ టిక్కెట్ టీడీపీకి వెళ్తుందని క్లారిటీ రావడంతోనే.. ఆ నియోజకవర్గానికి ఏకైక టికెట్ పోటీదారుగా ఉన్న బండారి రాజిరెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఏ మాత్రం చాన్స్ ఉన్నా… ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉండేవారు.
ఇక పార్టీ నేతలకు టిక్కెట్ల పంపిణీ కోసం.. ఓ స్క్రీనింగ్ కమిటీని నియమించారు. అయితే… ఈ కమిటీ ఓ అధికారిక ముద్ర కోసమేనన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. అభ్యర్థుల అంశంపైనా.. కొప్పుల రాజు అండ్ బృందం కసరత్తు చేసిందని చెబుతున్నారు. కొన్ని కొన్ని స్థానాల్లో పార్టీ నాయకత్వం వలసపోవడంతో… పెద్దగా ఆశలు లేకుండా పోయాయి. అలాంటి చోట్ల బలమైన నాయకత్వం పార్టీలోకి వస్తే ఆహ్వానించి టిక్కెట్లు ఇవ్వాలని… రాహుల్ సూచించారు. అంతే తప్ప.. టిక్కెట్ల కోసమే పార్టీలోకి వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.