అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పయనం ఎటు అనే ప్రశ్న.. చాన్నాళ్లుగా ప్రశ్నగానే ఉండిపోతూ వస్తోంది. ఆయన ఏదో ఒక పార్టీలో చేరబోతున్నారు అనే చర్చ తెరమీదికి రావడం.. మళ్లీ కొన్నాళ్లకు ఆ అంశం తెరమరుగైపోవడం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి కూడా ఈ టాపిక్ తెరమీదికి వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్థావన ఆంధ్రా కాంగ్రెస్ నేతల మధ్య వచ్చినట్టు తెలుస్తోంది! వచ్చే ఎన్నికల నాటికి తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందనే ప్రతిపాదన ఏపీ కాంగ్రెస్ నేతల మధ్య చర్చకు వచ్చిందని సమాచారం. ఆయన సీఎంగా ఉండగా మంచిపేరే ఉందనీ, పదవిలో ఉన్నంత కాలం తనవంతు పాత్రను క్రియాశీలంగా పోషించారనే అభిప్రాయం ప్రజల్లోనూ ఉంది కాబట్టి.. కిరణ్ కుమార్ ను వెనక్కి పిలిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టు కథనం వినిపిస్తోంది.
ఏపీ పీసీసీ అధ్యక్షుడిని మార్చే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఉన్నారనీ, రఘువీరాకి ప్రత్నామ్నాయంగా ఇప్పుడున్నవారిలో ఎవరికి పీసీసీ పదవి కట్టబెట్టినా కొంత అసంతృప్తులకు ఆస్కారం ఉందనే అభిప్రాయమూ ఉంది. గడచిన మూడున్నరేళ్లుగా పార్టీని రఘువీరా నెట్టుకొస్తున్నారు కాబట్టి, ఆయన్ని తప్పిస్తే రఘువీరా అసంతృప్తి చెందే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అయితే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ఇస్తే.. ఎవ్వరికీ ఎలాంటి అసంతృప్తులూ ఉండవనేది ఆ పార్టీలో వినిపిస్తున్న విశ్లేషణ. ఆయన పార్టీలోకి రావడం అందరికీ సమ్మతమైన అంశమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఇంతకీ.. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు కిరణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారా లేరా అనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరారు. తమ్ముడి బాటలోనే అన్నగారు కూడా వెళ్తారనీ, కొన్ని రోజుల తరువాత కిరణ్ చేరిక ఉంటుందనే ప్రచారమూ సాగింది. అయితే, ప్రాంతీయ పార్టీల్లో చేరేందుకు కిరణ్ కొంత సుముఖంగా లేరని కొంతమంది అంటున్నారు. సరైన సమయంలో ఏదో ఒక జాతీయ పార్టీలోనే చేరాలన్నది కిరణ్ ఆలోచనగా చెబుతున్నారు! ఆ లెక్కన తమ్ముడు టీడీపీలో ఉన్నారు కాబట్టి, కిరణ్ భాజపా వైపే ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంది. జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ లో చేరితే.. రాజకీయంగా తమ్ముడికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. పైగా, క్షేత్రస్థాయిలో కిరణ్ తరఫున అత్యంత క్రియాశీలంగా ఉంటూ వస్తున్నది కూడా ఆయన తమ్ముడే కదా! ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతిపాదన ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. పార్టీపరంగా చూసుకుంటే కాంగ్రెస్ లోకి కిరణ్ రావడం వారికి సానుకూలాంశమే అవుతుంది. కానీ, వాస్తవ పరిస్థితుల్లో కాస్త సంక్లిష్టత కనిపిస్తోంది.