కాంగ్రెస్ పార్టీ ఇక ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించుకున్న “చింతన్ శివిర్”లో మేధోమథనం జరిపి ప్రజల్లోకి ఎలా వెళ్లాలో నిర్ణయించుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఓ రకంగా ఇది గతంలో బీజేపీ నేతలు చేసిన రథయాత్ర తరహాలో ఉంటుంది. ఎక్కడిక్కడ సీనియర్ నేతలు పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ నేతలు జగజాగరణ యాత్ర పేరుతో యాత్రలు చేయనున్నారు. గతంలో ఓ విడత ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. రెండో విడత మరింత ఉద్ధృతంగా నిర్వహించనున్నారు.
పార్టీ చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అన్నింటినీ అధిగమిస్తామని సోనియా గాంధీ చెబుతున్నారు. నిరుద్యోగం అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని యాత్రలు చేయనున్నారు. దేశాన్ని కాపాడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యతని.. దేశ విభజన.. వ్యతిరేకత శక్తులతోనే పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. చింతన్ శివిర్‌లో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇందులో పేపర్ బ్యాలెట్‌ను మళ్లీ తీసుకు రావాలన్న చర్చ ప్రధానంగా జరిగింది. దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తరచూ నైరాశ్యంలోకి వెళ్తున్నారని.. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ పార్టీని ఇకనుంచి ముందుండి నడిపించాలని, ఆయన తెర వెనుక నాయకత్వం నిర్వహించకూడదని నిర్ణయించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపై చర్చించినా.. తమ బలహీనత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసింది.. వాటిని అధిగమిస్తే.. బీజేపీకి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.