ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదంలో చనిపోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. లోక్ సభతో పాటే ఉపఎన్నిక జరగనుంది. ఈ స్థానంలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమయింది. ఇందు కోసం అభ్యర్థిని రెడీ చేసుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీగణేష్ అనే లీడర్ ని పార్టీలో చేర్చుకున్నారు. గద్దర కుమార్తెను గత ఎన్నికల్లో నిలబెట్టారు కానీ ఆమె మూడో స్థానంలో నిలిచారు.
ఈ సారి కూడా గద్దర కుమార్తెకు చాన్స్ ఇవ్వాలనుకున్నా.. బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఉద్దేశంతో కంటోన్మెంట్ ప్రాంతంలో మంచి పరిచయాలు ఉన్న శ్రీగణేష్ అనే నేతను కాంగ్రెస్ ఆకర్షించింది. మామూలుగా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే.. పోటీని పెట్టవు రాజకీయ పార్టీలు. కానీ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అభ్యర్థిని పెట్టకపోతే.. పార్లమెంట్ స్థానంపైనా ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్ పోటీ పెట్టాలని డిసైడయింది.
బీఆర్ఎస్ తరపున ఎవర్ని నిలబెడతారన్న దానిపై స్పష్టత లేదు. లాస్య నందిత సోదరి లాస్య నివేదిత తనకే సీటివ్వాలని కోరుతున్నారు. మీడియా ముందుకు వచ్చి విజ్ఞప్తి చేశారు. త్వరలో కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. అయితే మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిషాంక్ తనకు చాన్సివ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్ ఎవరికి చాన్సిస్తారో ఇంకా స్పష్టత రాలేదు.