నంద్యాల ఉప ఎన్నికల్ని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కారుపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఎన్నికే రెఫరెండమ్ అవుతుందని వైకాపా ఆశిస్తోంది. నంద్యాలలో టీడీపీని ఓడించడం ద్వారా 2019 ఎన్నికల్లో దూసుకుపోతామనే పాజిటివ్ ఎనర్జీని పార్టీలో నింపేందుకు రకరకాల వ్యూహాలతో జగన్ ఉన్నారు. మైనారిటీలు, దళితుల్లో వైకాపాకి మంచి పట్టు ఉంది కాబట్టి, తమ గెలుపు ఖాయం అన్నట్టు ధీమాతో ఉన్నారు. ఇక, తెలుగుదేశం కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది. భూమా ఫ్యామిలీపై ఉన్న సింపథీ తమని గట్టెక్కిస్తుందనీ, టీడీపీలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు భూమా అఖిల ప్రియ వర్గం సర్వశక్తులూ ఒడ్డుతుందని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. అయితే, ఇంతవరకూ ద్విముఖం అనుకున్న నంద్యాల ఉప ఎన్నిక.. ఇప్పుడు త్రిముఖం కాబోతోంది! మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అయిపోయింది. నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెడుతున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు.
నిజానికి, 2014లో నంద్యాల నుంచీ జూపల్లి రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఆయనకి కేవలం 2,459 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇలాంటి గతానుభం ఉండి కూడా ఏ ధైర్యంతో కాంగ్రెస్ మళ్లీ పోటికి దిగుతోందీ అంటే… వారి లెక్కలు వారికున్నాయి. నంద్యాలలో ప్రస్తుతం పరిస్థితిలు మారాయనీ, కాంగ్రెస్ కు లాభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది రఘువీరా ధీమా. గత ఎన్నికల్లో మాదిరిగా ఇప్పుడు వైకాపాపై ప్రజల్లో అంత విశ్వాసం లేదనేది రఘువీర అంచనా. పైగా, ఈ మధ్య జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రావడం, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడం, నామినేషన్ దాఖలు చేసేందుకు జగన్ ను భాజపా ఆహ్వానంచడంతో భవిష్యత్తులో ఈ రెండు పార్టీల మధ్యా పొత్తు ఉండే సంకేతాలు వస్తున్నాయి. వైకాపా ధోరణిలో ఈ మార్పే కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు.
భాజపాకి జగన్ దగ్గర అవుతూ ఉండటం వల్ల… మైనారిటీలు, దళితులు వ్యతిరేకించే అవకాశం ఉంది. అలాగని, వారు టీడీపీవైపు కూడా మొగ్గు చూపలేరు కాబట్టి, మూడో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గుతారనేది వారి నమ్మకం. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించబోతున్నట్టు సమాచారం. మైనారిటీ లేదా రెడ్డి వర్గానికి చెందిన నాయకుడికి టిక్కెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ టార్గెట్ గెలుపే కావొచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే… ఆ పార్టీ సోలోగా సాధించేదేమీ కనిపించడం లేదు. కానీ, ఈ పరిణామం వైకాపాకి ఇబ్బంది పెట్టొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ చీల్చితే.. అతి వైకాపాకి కాస్త మైనస్సే అవుతుందని చెప్పొచ్చు.