నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకుంటున్న కేసీఆర్కు మరో మంచి అవకాశం ఎదురు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన వెళ్లి కలిసిన ప్రముఖుల్లో మమతా బెనర్జీ ఒకరు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకున్న తర్వాత రెండు సార్లు కోల్కతా వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. ఆమె ఇప్పుడు… బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. గత మూడు నెలలుగా ఈ ర్యాలీ కోసం… తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా… బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నారు. ఈ ర్యాలీలో బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నీ పాల్గొంటున్నాయి. అంటే దీనర్థం… ఈ ర్యాలీలో పాల్గొనే పార్టీలన్నీ… కాంగ్రెస్కు అనుకూలం అని కాదు. ఆ మాటకొస్తే.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కూడా.. కాంగ్రెస్కు అనుకూలం కాదు.
తృణమూల్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న ర్యాలీలో.. దాదాపుగా ప్రాంతీయ పార్టీల నేతలందరూ పాల్గొనబోతున్నారు. ఒక్క మాయవతి మినహా.. మిగతా అందరు నేతలు.. తమ రాకను కన్ఫర్మ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా.. మమతా బెనర్జీకి మద్దతు పలికారు. బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న వారిలో ఆమె ముందు ఉంటారని చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏకపక్షంగా ప్రకటించిన స్టాలిన్ కూడా హాజరవుతున్నారు. అంటే.. కూటమిలో ఉన్నారా లేదా.. అని పట్టించుకోకుండా.. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ హాజరు కాబోతున్నాయి.
బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లుగా చెబుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. జాతీయ మీడియా ఈ విషయంలో టీఆర్ఎస్ స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేసినా… ఎవరూ అందుబాటులోకి రాలేదు. అయితే.. అది పూర్తిగా బీజేపీ వ్యతిరేక ర్యాలీ.. కొన్ని కాంగ్రెస్ అనుకూల పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. అంత కంటే…ముఖ్యంగా.. చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. మరి కేసీఆర్ హాజరవుతారా లేదా..? అన్నది ఆసక్తికరం. హాజరవకపోతే బీజేపీ అనుకూల ముద్ర పడుతుంది. హాజరైతే.. రాజకీయంగా ఇబ్బందికరం అవుతుంది. ఈ సమస్యను కేసీఆర్ సులువుగానే అధిగమించగలరు.