గవర్నర్ ప్రసంగం సందర్భంగా టి. శాసన సభలో చోటు చేసుకున్న ఘటనను తెరాస సీరియస్ గా తీసుకుంటుందని ఊహించిందే. అయితే, ఊహించినదానికంటే మరింత సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. స్పీకర్ మధుసూదనాచారిపై దాడి ఘటనకు బాధ్యులుగా చేస్తూ 11 మంది కాంగ్రెస్ సభ్యులను శాసన సభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు సస్పెండ్ చేశారు. మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ పై హెడ్ ఫోన్ విసిరి గాయపరచారంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వాల రద్దు చేశారు. మహా అయితే ఓ ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు మాత్రమే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, సభ్యత్వాల రద్దు అనేది మాత్రం తీవ్రమైన నిర్ణయమే. అయితే, అనూహ్య పరిణామం ఏంటంటే.. ఈ నిర్ణయాన్ని ఏకంగా సభలో తీర్మానం పెట్టేసి ఆమోదింపజేయడం. దీంతో ఇది స్పీకర్ నిర్ణయం అని కాకుండా, ఏకంగా శాసన సభ తీర్మానం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అధికార పార్టీ చేయడం. అయితే, సభలో అలాంటి తీర్మానాలు పెట్టొచ్చా లేదా అనేది ఇక మొదలు కాబోయే చర్చ.
ఇక, కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ విషయానికొస్తే… ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత తీవ్రంగా తీసుకెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ నేతల సస్పెన్షన్ వ్యవహారాన్ని కేసీఆర్ సర్కారుపై మరింత తీవ్రంగా విమర్శలకు అనువైన అస్త్రంగా మార్చుకుంటుంది. బస్సు యాత్ర పునః ప్రారంభిస్తారు కాబట్టి, ఎలాగూ ఇంతవరకూ సాగిన యాత్రలో బలమైన వాయిస్ వినిపించలేకపోయారనే అభిప్రాయం ఉంది కాబట్టి, ఇప్పుడీ టాపిక్ ని ఆ రకంగా వాడుకునే అవకాశం ఉంది. దీంతోపాటు, ఈ అంశాన్ని మరింత తీవ్రతరం చేసి… కాంగ్రెస్ సభ్యులంతా ఈ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తే ఎలా ఉంటుందో అనే చర్చ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నట్టు సమాచారం.
ఎలాగూ సభలో తమకు ప్రాధాన్యత దక్కనీయకుండా అధికార పార్టీ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతలకు ఉంది కాబట్టి, సమావేశాల బహిష్కరణే సరైందనేది కొంతమంది అభిప్రాయంగా తెలుస్తోంది. కిం కర్తవ్యం ఏంటనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొన్ని ఆప్షన్లను చూస్తున్నారనీ, వీటిని హైకమాండ్ కు నివేదించి.. అక్కడి నుంచి వచ్చిన ఆదేశానుసారం పోరాటానికి దిగే వ్యూహంలో ఉన్నారని తెలుస్తోంది. వీలైతే న్యాయ పోరాటం, లేదంటే ప్రజాక్షేత్రంలో పోరాటం అన్నట్టుగా టి. నేతల వ్యూహం ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా, సభలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం మంచి సంస్కృతి కాదు. దాన్ని మరింత తీవ్రంగా పరిగణించేసి, తీర్మానం పెట్టేసి సభ్యులను సస్పెండ్ చేసే స్థాయిలో అధికార పార్టీ స్పందించడమూ సమర్థనీయం కాదు.