కృష్ణా నదీ జలాల వివాదం, యాజమాన్య నిర్వహణ అంశంంలో కాంగ్రెస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై గట్టిగా కౌంటర్ అటాక్ చేయాలని బీఆ్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైన దక్షిణ తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో బీఆరెఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత రెండు లక్షల మంది ప్రజలతో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. నల్లగొండలో నిర్వహించే ఈ సభపై కూడా నిర్ణయం తీసుకుంటారు.
అయితే దీనికి కాంగ్రెస్ గట్టి కౌంటర్ రెడీ చేసుకుంది. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయాల్సిన తప్పులన్నీ చేసి తమపై నిందలు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. పదేళ్ల కాలంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ పెద్దగా దృష్టి పెట్టలేదని .. తీవ్ర అన్యాయం చేశారని అసెంబ్లీలో ప్రజల ముందు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించాల్సిన ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ కరువు తీర్చేస్తుందని ఆశపడ్డ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఓ మోటార్ ఆన్ చేశారు. కానీ ప్రాజెక్టు ఇంకా నలభై శాతం కూడా పూర్తి కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేదని చెబుతున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి 30 కి.మీ. పూర్తయింది. పది కి.మీ. పెండింగ్లో ఉండగా.. గత పదేళ్లలో ఒక కి.మీ. మాత్రమే పూర్తి చేశారు. ఇది పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లందుతాయి. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా పనులు చేయలేదని ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. పాలమూరు- రంగారెడ్డికి రూ.30 వేల కోట్లు ఖర్చుచేసినా ఎకరాకు కూడా నీరివ్వలేదని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. అవసరం లేకపోయినా కాళేశ్వరంకు లక్షకోట్లు పెట్టి… దక్షిణ తెలంగాణ నోట్లో మట్టికొట్టారని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమయింది.