షర్మిల పూర్తిగా కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయారు. చేర్చుకునేందుకు కాంగ్రెస్ కు ఆసక్తి లేదని తేలుతున్నా షర్మిల గుర్తించడం లేదు. ఒంటరి పోటీ అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు… కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఏ విషయం చెప్పడం లేదు. సెప్టెంబర్ 30వరకూ షర్మిల డెడ్ లైన్ పెట్టింది. కానీ కాంగ్రెస్ స్పందించలేదు. మరో నాలుగైదు రోజులు ఆగండి అని ఓ సలహాదారు సలహా ఇచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసిన షర్మిల.. పార్టీని బలోపేతం చేయాలని పాదయాత్ర కూడా నిర్వహించి గట్టిగానే ప్రయత్నించారు. కానీ పెద్దగా బజ్ రాకపోడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమైపోయారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ కు ప్రతిపాదనపెట్టారు. రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. కానీ విలీనం దిశగా ఇప్పటివరకు ఎలాంటి అడుగూ పడలేదు.
షర్మిల వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఆమె చేరిక వల్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రెచ్చగొట్టే అవకాశం ఉందని అందుకే చేర్చుకోవద్దని హైకమాండ్‌కు తేల్చిచెప్పేశారు. చివరికి కాంగ్రెస్ హైకమాండ్.. షర్మిలకు అటు ఓకే కానీ.. ఇటు నో అని కానీ చెప్పలేదు. అలా నాన్చడంతో షర్మిల తదుపరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోయారు. కాంగ్రెస్‌కు సెప్టెంబర్ 30 వరకూ గడువిచ్చినా స్పష్టత లేదు. దీంతో ఒంటరి పోటీ తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
పార్టీ స్థాపించిన తర్వాత చేసిన సుదీర్ఘ పాదయాత్ర క్రెడిట్ అంతా.. విలీనం పేరుతో చేసిన రాజకీయంతో తుడిచిపెట్టుకొని పోయిందని పార్టీలో చర్చ జరుగుతున్నది. పైగా కాస్తో కూస్తో జనాల్లో తెలిసిన నాయకులు పార్టీని వీడి తమ దారి తాము చూసుకున్నారు. ఇప్పుడు షర్మిల పార్టీని మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల షెడ్యూల్ రానున్న సమయంలో ఇది సాధ్యం కాదు. పోటీ చేస్తే ఒకటి, రెండు శాతం ఓట్లుకూడా రావు. అదే జరిగితే ఫలితాల తర్వాత ఏపీకి వెళ్లినా పట్టించుకునేవారు ఉండరు.