కశ్మీర్ విషయంలో … మోడీ మధ్యవర్తిత్వాన్ని కోరారంటూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రేపిన కలకలం అంతా ఇంతా కాదు. అయితే..మోడీ ఆ వ్యాఖ్యలకు.. చేతలతోనే సమాధానం చెప్పారు. కశ్మీర్‌పై ఎవరి జోక్యాన్ని సహించేది లేదంటూ… ఆర్టికల్ 370ని రద్దు చేసి పడేశారు. అయితే.. ఇప్పుడు.. కాంగ్రెస్‌కు అలాంటి టెన్షనే ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెచ్చి పెట్టారు. కశ్మీర్‌ని అంతర్జాతీయ అంశం చేసేందుకు ప్రయత్నించారు. ఆయన అలాంటి.. ఇలాంటి నేత అయితే.. పర్వాలేదు కానీ.. సోనియా ఏరి కోరి.. నియమించిన .. లోక్‌సభా పక్ష నేత కావడంతోనే.. అసలు చిక్కు వచ్చింది.
అధిర్ రంజన్ చౌదరి.. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత..! ఆర్టికల్ 370పై బీజేపీ కడిగిపారేస్తారనుకుంటే.. ఆయన సెల్ఫ్ గోల్ వేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ముఖ్యంగా కశ్మీర్ భారత అంతర్గత విషయం కాదు.. దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో సాగుతుంది అని చెప్పడంతో కాంగ్రెస్ ఎంపీలే షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న సోనియా గాంధీ సైతం మండిపడ్డారు. ఆవిడ అక్కడే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రంజన్ తీరుపై రాహుల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి ట్రంప్‌లా మారిపోయారన్న విమర్శలు , సెటైర్లు బహిరంగంగానే వినిపించాయి. అసలు ఆర్టికల్ 370, కశ్మీర్ విభజనపై కాంగ్రెస్ ఒక్క మాట మీద లేదు.
కాంగ్రెస్‌లో పలువురు నేతలు ఆర్టికల్ 370 రద్దును స్వాగతించారు. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాధిత్య సింధియా ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం అని చెప్పారు. వీళ్లే కాదు.. సీనియర్లు, జూనియర్లు.. ఇలా కొందరు కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించారు. సోనియా, రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాహుల్ ట్వీట్‌తో మాత్రమే సరిపెట్టారు. తాజా పరిస్థితి… కాంగ్రెస్ ధీనస్థితికి అద్దం పట్టింది.