తెలంగాణా కాంగ్రెస్ నేతలని తెరాసలో చేర్చుకొంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తున్నందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందని, రాష్ట్రం కెసిఆర్ కుటుంబ సభ్యుల చేతిలో బందీ అయిపోయిందని విమర్శించారు. దళితులకి మూడెకరాల భూమి, కేజీ నుంచి పిజి వరకు ఉచిత విద్య, పంట రుణాల మాఫీ వంటి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, రెండేళ్ళయినా వాటిని అమలుచేయకుండా ప్రజలని మోసగిస్తున్నారని విమర్శించారు. మహాసముద్రం వంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కెసిఆర్ ఎంత మంది నేతలని పట్టుకుపోయినా పరువాలేదని అన్నారు. మళ్ళీ కొత్త తరం నాయకులని కాంగ్రెస్ తయారుచేసుకోగాలదని అన్నారు. దిగ్విజయ్ సింగ్ ఇంకా చాలా విమర్శలు చేశారు.
వాటన్నిటికీ నిజామాబాద్ ఎంపి కవిత చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకోలేని దిగ్విజయ్ సింగ్ తెరాసపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెరాసలోకి ఎవరు ఎప్పుడు వచ్చినా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. తెరాస ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీలాగ కమీషన్ల కోసం ఆలోచించదని అన్నారు. ఆమె కూడా దిగ్విజయ్ సింగ్ ని ఉద్దేశ్యించి ఇంకా చాలా విమర్శలు చేశారు.
ఇప్పుడు ఆ రెండు పార్టీలని పరిశీలిస్తే వాటి వారు తమ పార్టీలని సమర్ధించుకోవడానికి ఏవిధంగా వితండవాదనలు చేస్తున్నారో అర్ధం అవుతుంది. తెరాస అధికారంలోకి వచ్చినప్పతి నుంచి నేటి వరకు కూడా ఏ సమస్య ఎదురైనా కూడా తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలని నిందిస్తూనే ఉంది. ఆ పార్టీల పాలనలో తెలంగాణాకి చాలా అన్యాయం జరిగిందని, ఆ పార్టీలలో పాలకులు అవినీతిపరులని ఆరోపిస్తుంటుంది. మళ్ళీ ఇప్పుడు అవే పార్టీల నుంచి ఆ నేతలనే తమ పార్టీలోకి రప్పించుకొని వారికే మంత్రి పదవులు కట్టబెట్టడం అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాలలో పనిచేసినప్పుడు అసమర్ధులు, అవినీతిపరులుగా కనిపించిన వారందరూ తెరాసలోకి రాగానే సమర్ధులు, నీతివంతులయిపోతారా? అంటే కాదనే అర్ధం అవుతుంది. ఇప్పుడు తెరాస ప్రభుత్వంలో, పార్టీలో వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళు కాంట్రాక్టులు, కమీషన్లు తీసుకోవడం లేదంటే నమ్మశక్యంగా ఉందా? గుత్తా సుఖేందర్ రెడ్డితో సహా కాంగ్రెస్, తెదేపాల నుంచి తెరాసలో చేరుతున్న చాలా మంది నేతలు కేవలం తమ కాంట్రాక్టులు, ఆర్ధిక లావాదేవీలు సజావుగా సాగడానికే చేరుతున్నారనే దిగ్విజయ్ సింగ్ ఆరోపణలని కొట్టి పారేయలేము.
ఇక కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. కెసిఆర్ కుటుంబ పాలన గురించి విమర్శిస్తున్న దిగ్విజయ్ సింగ్ తమ పార్టీలో గత ఆరు దశాబ్దాలుగా నెహ్రు కుటుంబంలోనే చిక్కుకొని నేటికీ వారి చేతులలో నుంచి బయటపడలేకపోతోందని తెలుసు. రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి పార్టీలో నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి పగ్గాలు అప్పగించినప్పటికీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యత ప్రియాంకా వాద్రాకి అప్పగించాలనుకోవడం ఏమనుకోవాలి. నెహ్రు వారసులకి మాత్రమే కాంగ్రెస్ పార్టీని, యూపియే ప్రభుత్వాలని నడిపించడం జన్మహక్కు అని భావిస్తున్నప్పుడు మళ్ళీ ఎదుటవాళ్ళని వేలెత్తి చూపడం ఎందుకు? నిజం చెప్పాలంటే కెసిఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు నలుగురు కూడా తమ సమర్దని నిరూపించుకొని చూపుకొంటున్నారు. కానీ రాహుల్ గాంధీ నేటికీ తల్లి, అక్క చాటు బిడ్డడిగానే వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ పాలనలో అవినీతి, కుంభకోణాలు దేశమంతా వ్యాపింపజేసింది. అందుకే ప్రజలు దానిని తిరస్కరించారు. ఇంకా తిరస్కరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ తాము ఎందుకు తిరస్కరణకి గురవుతున్నామని ఆలోచించకుండా, ఆత్మవిమర్శ చేసుకొని తమ తప్పులని, లోపాలని సరిదిద్దుకోకుండా కాంగ్రెస్ నేతలు అందరూ ఇంకా తమకి అలవాటయిన మూస పద్దతిలోనే ముందుకు సాగుతున్నారు. ఎదురుదెబ్బలు తింటున్నారు. అది స్వయంకృతాపరాధమే కనుక ఇతరులని నిందించి ప్రయోజనం ఉండదు.