నాగార్జున సాగర్‌లో కమ్యూనిస్టుల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టదల్చుకోని కాంగ్రెస్ కమ్యూనిస్టుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అభ్యర్థిగా ఎప్పుడో ఖరారైన జానారెడ్డి గ్రామాలన్నీ చుట్టేస్తున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయనకు గ్రామ గ్రామాన పరిచయాలు ఉన్నాయి. అయితే ఏ చిన్న అవకాశం కూడా వదిలి పెట్టకూడదనుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కమ్యూనిస్టుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉంది. విధేయంగా ఉండే క్యాడర్ ఉన్నారు.
నాగార్జునసాగర్‌లోనూ వారికి బలం ఉంది. రెండు పార్టీల సానుభూతిపరులు వేలల్లోనే ఉంటారని అంచనా. ఉపఎన్నికల్లో సీపీఎంతో పాటు సీపీఐ కూడా పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీ క్యాడర్ మద్దతు తమకు లభించేలా చేసుకోవడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ చీఫ్ భట్టి విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై కమ్యూనిస్టు పార్టీలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దుబ్బాక ఉపఎన్నికల్లోనూ కమ్యూనిస్టు పార్టీలు అభ్యర్థిని పెట్టలేదు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఏపార్టీకి ఇతర పార్టీల మద్దతు లభించడం లేదు.
జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. టీడీపీ కూడా సొంతంగా పోటీ చేస్తోంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తే.. ఆ పార్టీకే కాస్త అదనపు బలం లభించినట్లవుతుంది. అందుకే కమ్యూనిస్టు పార్టీల నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది. పోటీ హోరాహోరీగా ఉంటుందని ఎలాంటి ఓట్లు కలిసి వచ్చినా అది గొప్పగేమ్ ఛేంజర్ అవుతుందన్న నమ్మకంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు.