మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ చివరి ఘడియ వరకూ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి సీట్ల కేటాయింపు విషయమై ఇంకా తర్జనభర్జన కొనసాగుతున్నట్టు సమాచారం. మొదట్నుంచీ ఈ పార్టీకి ఎనిమిది సీట్లు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. ఆ తరువాత, కోదండరామ్ పట్టు బిగించేసరికి… ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచారు, ఫైనల్ గా ఇప్పుడు 11 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఇక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది. దానిపైనే టీజేయస్ అధ్యక్షుడు కోదండరామ్ అసంతృప్తికి లోనౌతున్నట్టు సమాచారం.
ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే… ఇచ్చినట్టుగానే టి.జె.ఎస్.కి ఇవ్వాల్సిన స్థానాలు ఇస్తూనే, కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ చెప్పడం! అంటే, సీట్లు కేటాయించినట్టుగానే కేటాయించి, ఇంకోపక్క పోటీకి కాంగ్రెస్ అభ్యర్థుల్ని దించుతారట! దీన్ని ఏ తరహా పొత్తు అంటారో మరి. అయితే, ఈ షరతుపై కోదండరామ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి మెలికలు వద్దని ఆయన కాంగ్రెస్ కి చెప్పినట్టు సమాచారం. దీంతోపాటు, కాంగ్రెస్ ఇస్తామని చెబుతున్న సీట్లపై కూడా కోదండరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే స్థానాలపై టీజేయస్ పెదవి విరుస్తోంది. కీలకమైన జిల్లాల్లో తమకు సీట్లు దక్కడం లేదనీ, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం వంటి జిల్లాల్లో తమకు ప్రాతినిధ్యం కావాలనీ, ఆయా జిల్లాల్లో తమకు మంచి పట్టు ఉందనే వాదనను కాంగ్రెస్ ముందు టీజేయస్ వినిపిస్తోంది.
చివరి వరకూ బేరసారాలు కొనసాగించాలనే పట్టుదలతోనే కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. నిజానికి, మిత్రపక్షాలకు కేటాయించే ఈ కొద్ది సీట్లపై అంత పట్టుదల అవసరం లేదనే చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మిత్రపక్షాలేవీ కాంగ్రెస్ ను కాదని బయటకి వెళ్లే పరిస్థితి లేదనేది స్పష్టంగా ఉండటంతో… అదే కాంగ్రెస్ పార్టీకి బలమైన అంశంగా మారిందనీ అనుకోవచ్చు. మొదట్నుంచీ అనుకుంటున్నట్టుగానే… చివరి నిమిషం వరకూ బేరాలు కొనసాగిస్తే… వీలైనన్ని తక్కువ సీట్లు ఇవ్వొచ్చని కాంగ్రెస్, అదే పంథాను అనుసరిస్తే వీలైనన్ని ఎక్కువ దక్కించుకోవచ్చనే వ్యూహంలో మిత్రపక్షాలు ఎవరి కసరత్తులు వారు చేస్తున్నారు. ఏదేమైనా, సర్దుబాటు అంకం దాదాపు చివరికి వచ్చేసిందన్నది వాస్తవం.