కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా లాంటిదే. ఏపీలో ఐదు గ్రామాలు తెలంగాణలో కలుపుకోవాలంటే… ఏపీతో మాట్లాడి.. సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. మేనిఫెస్టోల్లో పెట్టి రాజకీయం చేస్తే మరింత క్లిష్టం అవుతుంది.
పోలవరం ముంపు మండలాలు అయిన ఏడు మండలాల్ని రాష్ట్ర విఙజన తర్వాత ఏపీలో కలిపారు. అయితే భద్రాచలం పట్టణాన్ని మాత్రం మినహాయించారు. అదే విషయాన్ని చెప్పి చట్టం చేశారు. భద్రాచలం పట్టణం తప్ప.. మిగిలిన మండలం అంతా ఏపీనే. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. భద్రచలానికి అతి సమీపంలో ఉన్న ఐదు గ్రామాలు ఏపీ పరిధిలో కలిసిపోయాయి. కానీ అవి ఏపీకి చాలా దూరంగా ఉన్నాయి. గోదావరి ముంపు రాకుండా కరకట్ట ఆ గ్రామాల్లోనే కట్టాలి. ఇది కట్టడానికి తెలంగాణ సర్కార్ కు అవి ఏపీ గ్రామాలు కావడం సమస్యగా మారింది. అందుకే ఆ గ్రామాలు తమకు ఇవ్వాలని అడుగుతున్నారు.
నిజానికి కరకట్ట నిర్మాణమే సమస్య అయితే… తాము కూడా సహకరిస్తామని ఏపీ ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. కానీ వరదలొచ్చే వరకూ నాటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించకోలేదు. పైగా ఏడు మండలాలు గుంజుకున్నారంటూ రాజకీయం చేసి సరి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏడు మండలాలు కాకుండా ఐదు గ్రామాలతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ఆ ఐదు గ్రామాల ప్రజల గురించి జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో అక్కడి ప్రజల్లోనూ తమ గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ సమస్యను రాజకీయం చేసుకుని సెంటిమెంట్ పెంచేందుకు కాంగ్రెస్ బయలుదేరింది.