తెలంగాణ బీజేపీని పకడ్బందీగా రేసు నుంచి తప్పించే రాజకీయం జోరుగా సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే బీజేపీని సైడ్ చేసే పనిని విజయవంతంగా అమలు చేయగలుగుతున్నారు. ఇప్పుడు జిల్లాల్లోనూ అదే వాతావరణం ఏర్పడుతోంది. బీజేపీ కాస్త బలంగా ఉందని భావిస్తున్న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల పోరాటం ప్రారంభమయింది. కాంగ్రెస్ నేతగా ఉన్న కొండా మురళి.. బీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలు ప్రారంభమై.. . నువ్వా నేనా తేల్చుకుందామనే సవాళ్ల వరకూ వచ్చాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కేటీఆర్ పర్యటన తర్వాత ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఆ పర్యటన సందర్భంగా కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు కొండా మురళి, కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేయడంతో.. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వారికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. దాంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. దమ్ముంటే వచ్చి పరకాలలో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ నేతలు కొండ మురళి, కొండా సురేఖలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలైప కొండా మురళి స్పందించారు. పరకాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చల్లా ధర్మారెడ్డి ఉరికించడం ఖాయమని కొండా మురళి హెచ్చరించారు .
కొండా దంపతుల రాజకీయం పరకాల నుంచే ప్రారంభమైంది. పలుమార్లు అక్కడి నుంచి గెలిచారు. బీఆర్ఎస్ చేరి వరంగల్ నుంచి గెలిచారు. కానీ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఓడిపోయారు. ఈ సారి మాత్రం దూకుడుగా ఉన్నారు. గెలిచి తీరాలన్నపట్టుదలతో రాజకీయాలు చేస్తున్నారు. వీరి పోరాటం.. జిల్లా మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు రాజకీయాల్ని మారిపోయేలా చేస్తోంది.