తెలంగాణలో లాంటి రాజకీయ పరిస్థితుల్నే హిమాచల్ ప్రదేశ్‌లో ఎదుర్కొన్న కాంగ్రెస్ అక్కడ హోరాహోరీ పోరులో విజయం సాధించింది. ఇప్పుడు తెలంగాణలోనూ హిమాచల్ లో అనుసరించిన వ్యూహంతోనే ముందుకు వెళ్లాలని అనుకుంటోంది. త్వరలో ప్రియాంక గాంధీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర పూర్తయ్యాక.. ప్రియాంకా గాంధీ తెలంగాణలో పాదయత్ర చేయవచ్చని చెబుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ ప్రతీ నియోజకవర్గం నేతలతో, కార్యకర్తలతో భేటీ కావడమే కాదు ప్రతీ వీధి , ప్రతీ ఇల్లు తిరిగి పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యలతో పాటు వివిధ వర్గాల సమస్యలను తెలుసుకున్నారు. వాటిపై ఫోకస్ చేసి ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు. ఫలితంగా తిరుగులేని మెజార్టీతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంది. ఇప్పుడదే ఫార్ములాని ప్రియాంక గాంధీ తెలంగామలోనూ అమలు చేసే అవకాశం ఉంది., మహిళా మోర్చా ర్యాలీలతో ప్రతీ ఇల్లు, ప్రతీ గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నా నేతల పనితీరు వల్లే పార్టీ బలోపేతం కావడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ లో నేతల మద్య విభేదాల కారణంగానే ఆ పార్టీ ప్రజల్లో మన్నలు పొందలేకపోతుందనీ, ఏపీలో పార్టీకి నేతలు, పనిచేసే కార్యకర్తలు లేకపోవడం వల్ల పార్టీ పుంజుకోవడంలేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మరి ఈ సమయంలో ప్రియాంకాగాంధీ పార్టీనీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేదే పెద్ద ప్రశ్న. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నా… ప్రియాంకా గాంధీ సమన్వయం చేసుకున్నారని అంటున్నారు., ప్రియాంకా తెలంగాణలో పాదయాత్ర చేస్తే రాజకీయం మారిపోయే చాన్స్ ఉంది .