వచ్చే ఎన్నికలకు ఏ పార్టీలో చేరాలా అని ఆలోచిస్తున్న కొంత మంది తెలంగాణ నేతలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఓ క్లారిటీ వచ్చినట్లయిందన్న భావన వినిపిస్తోంది. ఎంత హైప్ ఎక్కించుకున్నా బీజేపీ .. తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఎవరూ నమ్మలేకపోతున్నారు. కానీ కాంగ్రెస్ కు అలా కాదు. ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకోవాలనుకుంటే అలాంటి అవకాశాన్ని అంది పుచ్చుకోవడానికి ఆ పార్టీకి అన్ని వనరులు ఉన్నాయి. అందుకే పార్టీ మారాల్సి వస్తే ఎక్కువ మంది చాయిస్ కాంగ్రెస్ అయ్యే అవకాశాలుఉన్నాయంటున్నారు.
అందరికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండైన జూపల్లి, పొంగులేటి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో తాము కాంగ్రెస్ లో చేరబోతున్నామన్న సంకేతాలు పంపారు. వీరు అనేక డిమాండ్లు పెడుతూ.. ఏ పార్టీలోనూ చేరకుండా అందరితోనూ చర్చలు జరుపుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం.. వారు పెళ్లి చూపులు చూస్తున్నారని.. కల్పనారాయ్ లాంటి బీజేపీలో ఎందుకు చేరుతారని..ఐశ్వర్యారాయ్ లాంటి కాంగ్రెస్ లోనే చేరుతారని నమ్మకం పెట్టుకున్నారు.
వారిద్దరూ కాంగ్రెస్ లో చేరితే.. ఆటోమేటిక్ గా.. ఇతర నేతలూ వస్తారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారూ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పుంజుకుంది అనే అభిప్రాయం ప్రారంభమైతేచాలు కాంగ్రెస్ ను పట్టడం కష్టమని ఎక్కువ మంది అభిప్రాయం. మరో వైపు బీజేపీని ఎలాగైనా నేతలతో నింపేయాలని చేస్తున్న ప్రయత్నాలకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. చేరికల కమిటీకి ఇంచార్జ్ గా ఉన్న ఈటల రాజేందర్ విసుగుపుట్టి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ పెద్దలు సర్ది చెప్పారు. కొంత కాలం ఆగాలన్నారు. ఇప్పుడు ఆయనకు ఇక ఎలాంటి చేరికలు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు జోష్ అంతా కాంగ్రెస్ లోనే కనిపిస్తోంది. కొంత కాలం పాటు బీజేపీ ఈ నిరాశలోనే ఉండనుంది.