బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బలపడిపోతామనో… బీఆర్ఎస్ను బలహీనం చేస్తున్నామనో కాంగ్రెస్ అనుకుంటోంది కానీ… తమ పార్టీకే నిప్పు పెట్టుకుంటున్నామన్న సంగతిని గుర్తించలేకపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి పాతిక మంది వరకూ ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు. మరి వారిపై పోరాడి ఓడిపోయిన వారి సంగతేంటి ?. వారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడిన క్యాడర్ సంగతేంటి ?. ఇప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే వారు మాత్రమే రారు.. అధికార పార్టీ అనే ఫలాలు అనుభవించడానికి వారి అనుచరులు కూడా వస్తారు. దీని వల్ల ఎవరికి లాభం.
ఓ పార్టీ తరపున గెలిచిన వారిని మరో పార్టీ లో చేర్చుకోవాలనుకోవడం అనైతికమే. అయితే రాజకీయంలో ఇప్పుడు నైతికత.. అనైతికతకు చోటు లేదు. గతంలో కేసీఆర్ చేశారు. పైగా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని పదే పదే హెచ్చరికలు చేశారు. ఇక ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్నట్లుగా రాజకీయం ప్రారంభమయింది. కేసీఆర్ కు అనుంగు అనుచరులుగా.. శిష్యులుగా ముద్రపడిన వారు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇది తమ గొప్పతనం అని కాంగ్రెస్ అనుకుంటోంది. కానీ అది అధికారం గొప్పతనం.
కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరూ కాంగ్రెస్ లోకి రాలేదు. కాంగ్రెస్ పై దూషణలకు దిగారు. అంతేనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఎంత చేయాలో అంతా చేశారు. అయినా కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రయత్నించి.. ఆయా నియోజకవర్గాల్లో ఓడించిన వారు జై కాంగ్రెస్ అంటూ పంచన చేరుతున్నారు. ఇలాంటి చేరికల వల్లనే బీఆర్ఎస్ ఎక్కువ నష్టపోయింది. రేపు కాంగ్రెస్‌కూ అదే పరిస్థితి రానుంది. చేరికలతో బలహీనం అయ్యేది బీఆర్ఎస్ మాత్రమే కాదు కాంగ్రెస్ కూడా !