కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయా..? ఒకటి, రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఖాయమా..? సామాజిక వర్గం ఈక్వేషన్ తో పాటు ఓ ఎంపీ అభ్యర్థిపై ఏఐసీసీ గుర్రుగా ఉండటంతో మార్పులు,చేర్పులు తప్పవా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మాల, మాదిగ ఈక్వేషన్ తో గడ్డం వంశీని తప్పించి అక్కడి నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ఎంపికే చేసే అవకాశం ఉంది. తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాల్లో మాల సామాజిక వర్గ నేతలకే టికెట్లు ఇచ్చారు. దీనిపై మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పై గుర్రుగా ఉంది. ఇక, వరంగల్ నుంచి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరనుండటంతో ఆయనను బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మూడు లోక్ సభ సీట్లు మాల సామాజిక వర్గానికే దక్కినట్లు అవుతుందని.. అందుకే పెద్దపల్లి స్థానం మాదిగలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు టాక్.
పైగా..గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పై విమర్శలు వచ్చాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురికి టికెట్లు ఇస్తారా..? అని పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు లోక్ సభ పోరులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ తనయుడికి టికెట్ ఇవ్వడంపై పురాలోచించాలని పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే సామాజిక వర్గాల ఈక్వేషన్ లో భాగంగా గడ్డం వంశీని తప్పించాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి మాదిగ సామాజిక వర్గం నేతకు టికెట్ ఇచ్చి ఆ సామాజిక వర్గం నుంచి అసంతృప్తి లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు.
అదే సమయంలో సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ తో కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు డిమాండ్ చేస్తున్నా…ఇప్పుడు ఆయన బెట్టు చేస్తుండటంతో ఏఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం స్థానంలో అదే స్థానం నుంచి టికెట్ ఆశించిన బొంతు రామ్మోహన్ పేరును పార్టీ పరిశీలిస్తోందని టాక్.