తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని చిందర వందర చేసిన జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ను అలాగే చేయాలనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వచ్చినట్లే. జగన్ రెడ్డి గుట్లు, ముట్లు అన్నీ హైదరబాద్ లోనే ఉంటాయి. అక్కడ పట్టుకుంటే మొత్తం జాతకం బయటకు వచ్చేస్తుంది. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అండదండలతో… చెలరేగిపోయారు. హైదరాబాద్ పోలీసుల్ని ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.
ప్రస్తుత తెలంగాణ ఎన్నికల ఫళితాలు నేరుగా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపించకపోవచ్చు కానీ.. పరోక్షంగా మాత్రం ఉంటుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించినట్లయితే.. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి. రాజకీయంగా , ఆర్థిక పరంగా హైదరాబాద్ అత్యంత కీలకం. టీడీపీ నేతల వ్యాపారాలు అక్కడే ఉంటాయి. గత ఎన్నికల్లో టీడీపీ నేతల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. పార్టీ మారిపోవాలని.. లేదా పోటీ నుంచి వెనక్కి తగ్గాలని లేకపోతే ఆస్తుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని బెదిరింపులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ వైసీపీకి సహకరించిందని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇప్పుడు అప్పట్లో హైదరాబాద్ నుంచి అందిన సహకారం వైసీపీకి అందదు. ఆ ప్లస్ పాయింట్ టీడీపీకి లభించే అవకాశం ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. తమకు సాయం చేస్తారని టీడీపీ వర్గాలు అనుకునే అవకాశం ఉంది. నిజంగా చేస్తారా లేదా అన్నది ఎవరికీ తెలియదు కానీ.. రేవంత్ రెడ్డి సీఎం కాకూడదని.. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కోరుకున్నారు. సీఎం అభ్యర్థి భట్టి విక్రమార్క అంటూ ప్రచారం కూడా చేశారు. అయితే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో టీడీపీకి నైతిక బలం పెరుగుతుంది. ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కనిపిస్తోంది. దీనికి కారణం అంతో ఇంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ పైనే ఇంత వ్యతిరేకత ఉంటే.. అసలు ఎలాంటి అభివృద్ధి చేయని.. అన్ని వర్గాలనూ ఇబ్బంది పెడుతున్న సీఎం జగన్ పై ఇంకెంత వ్యతిరేకత ఉండాలని టీడీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికలు వార్ వన్ సైడేనని అనుకుంటోంది.