గత ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు కాంగ్రెస్ ను భారీగా తిరస్కరించారు. గడచిన మూడేళ్లుగా ఆ తిరస్కార భారాన్ని కాంగ్రెస్ మోసుకుంటూ వచ్చింది. విభజన పాపమంతా కాంగ్రెస్ దే అన్నట్టుగా టీడీపీ, భాజపా నేతలు విమర్శిస్తూ వచ్చారు. అయితే, ఆ దశ నుంచి ఏపీ కాంగ్రెస్ నెమ్మదిగా బయటపడేందుకు కావాల్సిన పునాదుల్ని రాహుల్ గాంధీ వేశారని చెప్పుకోవాలి. గుంటూరులో జరిగిన సభ ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఆక్సిజన్ అందించారు అనాలి. ప్రత్యేక హోదాను ప్రధానంగా ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన ప్రసంగం ప్రభావంతంగానే ఉంది.
ప్రత్యేక హోదా ఎందుకు రాలేదో, ఆ కథేంలో ప్రజలకు మెల్లమెల్లగా అర్థమౌతుందని రాహుల్ గాంధీ చెప్పారు. అంతేకాదు, విభజన పాపం కేవలం కాంగ్రెస్ దే అనే ముద్ర నుంచి బయటపడేందుకు కావాల్సిన వాదనను రాహుల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఏపీ విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారనీ, భారతీయ జనతా పార్టీ కూడా విభజనకు నాడు మద్దతు ఇవ్వడంతోనే నిర్ణయం జరిగిందనీ, దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఓ వాదనను రాహుల్ వినిపించారు. చంద్రబాబు, జగన్.. ఇలా ఎవరు పోరాడకపోయినా ప్రత్యేక హోదా తెచ్చేందుకు మేమున్నామని చెప్పారు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే తీసుకోబోయే మొదటి నిర్ణయం ఇదే అని రాహుల్ భరోసా కల్పించారు.
మొత్తానికి, రాహుల్ ఏపీ పర్యటన కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందనే చెప్పుకోవాలి. అయితే, ఇకపై రాష్ట్ర నేతలు స్పందించే తీరు ఎలా ఉంటుందన్నదానిపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, జగన్, చివరికి పవన్ కూడా ఫెయిల్ అవుతున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చే అవకాశాలున్నాయి. విభజన జరిగి మూడేళ్లు దాటేసింది. 2014 నాటి ఎన్నికల పరిస్థితి వేరు, 2019 నాటి లెక్కలు వేరు. గతంలో కాంగ్రెస్ మీదున్న కోపమే ఇప్పుడూ ప్రజల్లో ఉంటుందని అనుకోలేం. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు కాబట్టే.. రాహుల్ సభపై రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పై నాడు వ్యక్తమైన వ్యతిరేకతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. రాష్ట్ర విభజనకు నాడు టీడీపీ, భాజపాలు కూడా మద్దతు ఇచ్చాయనీ, అదేదో కాంగ్రెస్ పార్టీ సొంత నిర్ణయం కాదని ప్రచారం చేసుకోవడం. దాంతోపాటు గడచిన మూడేళ్లుగా ఆంధ్రాలో టీడీపీ, భాజపాలు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడం. పనిలోపనిగా ప్రత్యేక హోదా సాధనపై మీనమేషాలు లెక్కించే వైకాపా చిత్తశుద్ధిని ప్రశ్నించడం. గుంటూరు సభలో రాహుల్ ప్రసంగంలో ఈ మూడు అంశాలు ప్రస్థావించారు. ఆ స్ఫూర్తిని ఏపీ కాంగ్రెస్ నేతలు ఏ మేరకు కొనసాగిస్తారో అనేది వేచి చూడాలి. ఏదేమైనా, మూడేళ్లుగా నిర్లిప్తంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్ కు రాహుల్ కొంత ఊపు తెచ్చారనే చెప్పుకోవాలి