తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజార్టీతో గట్టెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్ మార్క్ 60 కంటే నాలుగైదు స్థానాలు మాత్రమే ఎక్కువగా లభించనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నలభై సీట్ల దగ్గర ఫిక్స్ అయ్యే పరిస్థితి ఉండటంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు ఏకపక్షంగా పట్టం కట్టాయి. ఖమ్మంలో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో ఒక్క సీటే బీఆర్ఎస్ కు వస్తోంది. ఈ సారి కూడా అదే సంప్రదాయం కొనసాగింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి కష్టం మీద సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి బయట పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం పధ్నాలుగు స్థానాలుంటే.. అందులో పది కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అన్న ప్రచారం ఉండటంతో.. ఆ జిల్లా ప్రజలు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ సారి అనూహ్యంగా బీఆర్ఎస్ కంచుకోటలయిన కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పోటీ ఇచ్చింది . రిజర్వుడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ విజయాలు సాధించింది. అయితే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. నాలుగైదు స్థానాలు కూడా సాధించలేకపోయింది.
గతంలో టీడీపీలో పని చేసిన నేతలు మొత్తం .. బీఆర్ఎస్ లో ఉండటం.. వారంతా తమ తమ నియోజకవర్గాల్లో గట్టి పట్టు సాధించడంతో విజయాలు వచ్చాయి. బీఆర్ఎస్ పరువును గ్రేటర్ చుట్టుపక్కన నియోజకవర్గాల్లో కాపాడాయి. సీఎం అభ్యర్థి విషయంలో లొల్లి పెట్టుకోకుండా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఇతర కాంగ్రెస్ నేతలు నిలిస్తే.. కాంగ్రెస్ గ్రేటర్ లోనూ పట్టు సాధించే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.