తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. రేవంత్ రెడ్డి.. కౌంటింగ్ కేంద్రం దగ్గర మీడియాతో మాట్లాడి.. ఓడిపోయిన బాధ .. మొహంలో కనిపించకుండా.. మహామహులే ఓడిపోయారని… కవర్ చేసుకున్నారు. అంతే.. మళ్లీ అప్పటి నుండి.. ఆయన మీడియా ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం… ఓటమిపై సమీక్షలు చేసుకుంటూ.. ఈవీఎంలపై.. విరుచుకుపడుతూంటే.. రేవంత్ రెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. అలా అని.. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉండటం లేదు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఏ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా వస్తున్నారు. అలా నిన్న ఓ హోటల్లో .. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి కూడా వచ్చారు.
సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడతారేమో అని.. మీడియా ప్రతినిధులు ఎదురు చూశారు కానీ… కుంతియా, ఉత్తమ్ మాట్లాడి సరి పెట్టారు. రేవంత్ ను మాట్లాడమని.. మీడియా ప్రతినిధులు ఒత్తిడి చేసినా.. ఆయన అంగీకరించలేదు. తర్వాత.. మెల్లగా తన మనసులో మాట చెప్పారు. రెండేళ్ల పాటు.. తాను మీడియాతో మాట్లాడబోనని ప్రకటించారు. దీంతో జర్నలిస్టులు ఒక్కసారిగా షాక్కు గురి కావాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.. టీఆర్ఎస్ అధినేత మాటలకు అదే రీతిలో కౌంటర్ ఇచ్చే ఒకే ఒక్క నేత రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వాయిస్ కూడా.. వినిపించకపోతే.. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితేమిటన్నది వారి ఆలోచన..!
అదే సమయంలో రేవంత్ రెడ్డి.. ఈ రెండేళ్ల అస్త్రసన్యాసం నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు ఆయన అత్యంత దూకుడుగా వ్యవహరించారు. ఈ కారణంగా… ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. ఐటీ దాడులు జరిగాయి. ఇప్పటికి రేవంత్ పై 40కిపైగా కేసులు ఉన్నాయి. ఇప్పుడే దూకుడుగా వ్యవహరిస్తే.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. ఇబ్బందికరం అవుతుందని.. వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతున్నారన్న భావన.. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి మాత్రం.. రెండేళ్ల పాటు మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. అంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ ఆలోచన లేనట్లే అనుకోవచ్చు..!