దేశమంతా ఎగ్జిట్ పోల్ ఫలితాల హడావుడిలో ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… అందరి ఫోకస్ ఆంధ్రా ఫలితాలపైనే ఉంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరిగినా కూడా తెరాసకే అత్యధిక స్థానాలు వస్తాయన్న ఒక నమ్మకంతో, ఇక్కడి ఎన్నికల ఫలితాలపై ఏమంత ఆసక్తి ఎక్కడా కనిపించడం లేదు! అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై టీ కాంగ్రెస్ లో కొంత చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా, రాష్ట్రంలో భాజపా ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలపై చర్చ జరుగుతుండటం విశేషం!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత, లోక్ సభ ఎన్నికల్ని కూడా కాంగ్రెస్ కాస్త ఉదాసీన వైఖరితోనే ఎదుర్కొందని అనడంలో సందేహం లేదు. దీంతో కొన్ని స్థానాల్లో భాజపాకి అనూహ్యంగా ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట! మహబూబ్ నగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్… ఈ నాలుగు స్థానాల్లో తెరాసకు గట్టి పోటీని భాజపా ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది! ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా… మూడో స్థానానికి పరిమితం కావొచ్చనే అంచనాలున్నాయట. వీటిలో కొన్ని భాజపా గెలుచుకునే అవకాశం ఉందనీ, ఒకవేళ ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచేలా ఉందనే లెక్కలు కాంగ్రెస్ నేతలు వేసుకుంటున్నట్టు సమాచారం. వీటితోపాటు, మరో ఐదు స్థానాల్లో కూడా భాజపా గెలవకపోయినా… ఓటు బ్యాంకును పెంచుకునేలా ఉందట! ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మల్కాజ్ గిరి, చేవెళ్ల…. ఈ స్థానాల్లో తెరాసకు కాంగ్రెస్ బలమైన పోటీ ఇచ్చిందనీ, కానీ భాజపా కూడా గతంతో పోల్చుకుంటే కొంతమేర ఓటు బ్యాంకును పెంచుకుందనేది టి. కాంగ్రెస్ వర్గాల అంచనాగా తెలుస్తోంది.
కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్టుగా ఆ నాలుగు స్థానాల్లో కొన్నైనా భాజపా గెలిచినా గెలవకపోయినా… రెండో స్థానంలోకి రావడమంటే ఆ పార్టీకి తెలంగాణలో విజయమనే చెప్పాలి! దాంతోపాటు, రాష్ట్రంలో కొంత ఓటు శాతం దక్కించుకోగలిగింది అంటే… కాంగ్రెస్ పార్టీకి సవాలుగానే మారుతుంది. ఒకవేళ, కేంద్రంలో మరోసారి మోడీ సర్కారు వస్తే… తెలంగాణలో కాస్త పెరిగిన ఈ ఓటింగ్ శాతం, రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు కావాల్సిన వేదిక భాజపాకి సిద్ధమైనట్టే అవుతుంది. పైగా, తెలంగాణలో తెరాసకు ధీటైన ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో కాంగ్రెస్ కనిపించడం లేదు. ఆ స్థాయిలో పోరాడితే తప్ప, పార్టీని కాపాడుకోలేమనే ఐకమత్యమూ కాంగ్రెస్ నేతల మధ్య లేదు. ఈ పరిస్థితులను భాజపా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టుగానే చెప్పాలి!