ఎన్నికలు జరుగుతోంది ఐదు రాష్ట్రాల్లో అయినా… మిగతా నాలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం టెన్షన్ పడటం లేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం టెన్షన్ పడుతోంది. దానికి కారణం.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ … రాజకీయాల్ని హ్యాండిల్ చేసే తీరు..కేసీఆర్ కు.. బీజేపీ సహకరిస్తున్న విధానం కావొచ్చన్న అభిప్రాయం ఉంది. తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదన్నది రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తున్న అభిప్రాయం. దీనికి భిన్నంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో ఏదో ఓ పార్టీకి పూర్తి మెజార్టీ ఖాయమే. ఎగ్జిట్ పోల్స్ లో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో హోరాహోరీ ఉంటుందని చెబుతున్నప్పటికీ.. ఎవరూ నమ్మడం లేదు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ వస్తుదని ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినా అదే పరిస్థితి..టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నా… హంగ్ వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ గెలవబోయే ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు ముందు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆ పార్టీకి చెందిన ప్రధాన వ్యూహకర్తల్ని హైదరాబాద్ కు పంపింది. గులాంనబీ ఆజాద్… డీకే శివకుమార్, అహ్మద్‌పటేల్, జైరాం రమేష్‌తో పాటు మరికొందరు నేతల్ని రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరూ.. టీఆర్ఎస్ వలలో పడకుండా.. పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు.
పోటీ చేసిన, గెలిచిన అభ్యర్థులందర్నీ.. కొంత మంది కీలక నేతలకు అటాచ్ చే్సతున్నారు. వారిని వారే కని పెట్టుకుని ఉండనున్నారు. అలాగే.. ఏ పార్టీకి , కూటమికి మెజార్టీ రాకపోతే.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తే ఎలా ప్రతిఘటించాలన్న విషయంపైనా .. అవసరం అయితే ఉన్న పళంగా కోర్టులో పిటిషన్లు వేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి రిజల్ట్ ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది.