ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణాలను వెతుక్కునే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. అంతర్మథనం మంచిదే. కానీ, కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. అంతర్యుద్ధం జరుగుతోంది! ఢిల్లీలో పార్టీ పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఒకరంటే మరొకరు అని సాకులు వెతుక్కునే పనిలో పడ్డారు ఆ పార్టీ నాయకులు. ఒకర్నొకరు బహిరంగంగా విమర్శించుకోవడం ప్రారంభించారు. అది కూడా ఉన్నవారి పేరుతో కాదు… లేనివారి పేరుతో రచ్చకెక్కుతూ ఉండటం విశేషం! ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత షీలాదీక్షిత్ హయాంలోనే పార్టీ పతనం మొదలైందంటూ కొందరు విమర్శ చేయడం… ఆమెని ఈ చర్చలోకి లాగడం సరైంది కాదంటూ మరికొందరు ప్రతివిమర్శలు చేయడమే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అంతర్మథనం!
షీలా దీక్షిత్ హయాంలోనే పార్టీ పతనం మొదలైందంటూ పరోక్షంగా విమర్శించారు పీసీ చాకో. 2013 నుంచి పార్టీ ఒక్కో ఎన్నికల్లో ఓడిపోతూ ఉందనీ, కానీ ఆ సమయంలో సరైన చర్యలు ఎవ్వరూ తీసుకోలేదంటూ పరోక్షంగా షీలా దీక్షిత్ నాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు! చాకో వ్యాఖ్యలపై మిలింద్ దేవ్ రా స్పందిస్తూ… షీలా గొప్ప రాజకీయ నాయకురాలనీ, పరిపాలనా దక్షురాలనీ, ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఢిల్లీ అభివృద్ధి చెందింది అన్నారు. ఆమె హయాంలోనే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో అత్యంత బలంగా ఉండేదన్నారు. మరణించిన తరువాత ఆమెపై నిందలు వేయడం సరికాదన్నారు. దీనిపై చాకో స్పందిస్తూ… షీలా దీక్షిత్ ని ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చెయ్యలేదనీ, తన మాటల్ని అపార్థం చేసుకున్నారన్నారు. ఇక, ఆప్ విజయాన్ని మెచ్చుకున్న చిదంబరంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందిస్తూ… చిదంబరం జీ… ఆప్ గెలిస్తే మనం సంబరాలు చేసుకోవడమేంటీ, భాజపా ఓడించే పనిని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ అప్పగించేసిందా? మన పీసీసీ దుకాణాలు మూసేసుకుందామా అంటూ ఘాటుగా ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓడితే ఓడిందిగానీ… భాజపా గెలవకపోవడం మంచిదైంది అంటూ శశిథరూర్ ఓ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
ఢిల్లీ ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఇది! దేశ రాజధానిలో పట్టు కోల్పోవడానికి అసలైన కారణాలను ఎవ్వరూ చర్చించడం లేదు. ఒకర్నొకరు తిట్టుకోవడానికే సరిపోతోంది. ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? షీలా దీక్షిత్ హయాంలో కాంగ్రెస్ ఎందుకు బలంగా ఉండేది..? ఢిల్లీలో భాజపా మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా ఎందుకు మార్చుకోలేకపోయామనే ప్రశ్నలేవీ నాయకుల మధ్య చర్చకు వస్తున్న దాఖలాలే లేవు. అంతర్మథనం చేేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి మాటలతో అంతర్యుద్ధాలకు దిగుతుంటే ప్రయోజనం ఏముంటుంది..? పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజార్చుకోవడమే అవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి కట్టడి చేయాలంటే సరైన నాయకత్వం ఉండాలి. కాంగ్రెస్ అసలు సమస్య అక్కడే ఉంది.