ఏపి రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు కూడా బాంబులాంటి మాట చెప్పారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “ఇతర పార్టీల నుండి చాలా మంది నేతలు మా బీజేపీ పార్టీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారు. వారిలో మా పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్నవారిని, మంచివారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాము,” అని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలను ఉద్దేశ్యించే ఆయన ఆ మాట అన్నారని వేరేగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే కావూరి సాంభశివరావు, పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ వంటి నేతలు బీజేపీలో చేరారు. రాయలసీమ, ఉత్తరంద్రాకు చెందిన మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నుండి మున్ముందు ఇంకా ఎంతమంది వెళ్ళిపోయినా ఆ పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. కానీ వైకాపా నుండి ఒక్క ఎమ్మెల్యే బయటకు వెళ్ళినా అది ఆపార్టీ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్యన వైకాపాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్ళిపోయారు. మరికొందరు క్యూలో ఉన్నట్లు తెదేపా చెప్పుకొంటోంది. ఇప్పుడు బీజేపీ కూడా తలుపులు తెరిస్తే ఇక వైకాపా పని అయిపోయినట్లే!
బీజేపీ ఏదో ఒకరోజున తెదేపాతో తెగతెంపులు చేసుకొంటుందని, అప్పుడు తప్పనిసరిగా తమ పార్టీతోనే జత కడుతుందని జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీల విషయంలో ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారే తప్ప ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించడం లేదు. కానీ వాటి గురించి మాట్లాడే సాకుతో అపుడప్పుడు ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి వారిని మంచి చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను లాగేసుకోవడానికి సిద్దం అయితే అది తట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమే అవుతుంది.
మార్చి ఆరున రాజమండ్రిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశ్యించిన ఆ సభకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా వస్తున్నారు. ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన తన మొట్టమొదటి రాష్ట్ర పర్యటనలోనే చెప్పారు. కనుక ఆరవతేదీన జరుగబోయే ఆ సభలో బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నవారందరూ ఆయన చేత కాషాయ కండువాలు కప్పించుకొనే అవకాశం ఉంది. అంటే మార్చి ఆరవ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలకు మరో జలక్ ఉండే అవకాశం ఉందని భావించవచ్చును. ఎన్నడూ మీడియా ముందుకు రాని మాణిక్యాలరావు బహుశః అందుకే మీడియా ముందుకు వచ్చి ఈ ప్రకటన చేసారేమో?