హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటేనే అసమ్మతికి మారుపేరు. అసమ్మతి, ముఠాలు ఆ పార్టీ సంస్కృతిలో భాగం. ఏదైనా ఎన్నికలు రాగానే అది అసమ్మతి తారాస్థాయికి చేరటం సర్వసాధారణం. ఒక సందర్భంలోనైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర కార్యాలయంగా ఉన్న గాంధీ భవన్‌కే అసమ్మతివాదులు నిప్పంటించేశారు. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా టికెట్ల కేటాయింపుపై అసమ్మతి భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేతలు సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతి, లక్ష్మారెడ్డి, శ్రీధర్ పార్టీ తెలంగాణ నాయకత్వంపై మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారని అంటున్నారు. హైకమాండ్‌కు దీనిపై లేఖలు రాయాలని నిర్ణయించారు. పీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మరోవైపు టీడీపీ, బీజేపీ శిబిరాలలో కూడా అసమ్మతి వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నాయకత్వాలు అసమ్మతికి దడిసి, అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. నామినేషన్లు దాఖలు చేయటానికి ఇవాళ ఆఖరిరోజు కావటంతో ఈ రెండు పార్టీలకు చెందినఆశావహులదరూ నామినేషన్లు దాఖలు చేసేస్తున్నారు.