బీజేపీతో ఎలాంటి గొడవలు లేవని.. కావాలంటే.. ఎన్డీఏలో చేరుతామంటూ… సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన.. వైసీపీలో కలకలం రేపుతోంది. బొత్స సత్యనారాయణ.. తన సొంతానికి అలాంటి కీలకమైన ప్రకటనలు చేయరు. కచ్చితంగా పై నుంచి సూచనలు వచ్చి ఉంటాయని నమ్ముతున్నారు. దీంతో ఒక్క సారిగా వైసీపీలో కలకలం రేగింది. మొదటగా ఆ సెగ.. వైసీపీలోని ముస్లిం నేతలను తాకింది. కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా నోటి వెంట రాజీనామా మాట వచ్చింది. సీఏఏ, ఎన్నార్సీ విషయంలో… రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు నిరనసలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిరసనల్లో వైసీపీ నేతలకు వ్యతిరేక సెగ ఎదురవుతోంది.
ఆంజాద్ భాషా.. కొన్నాళ్లుగా.. సీఏఏకు వ్యతిరేకంగా ఘాటు ప్రకటనలు చేస్తున్నారు. ముస్లింలకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తానని ప్రకటిస్తున్నారు. దాంతో ఆయనకు కాస్త సానుకూలత కనిపిస్తోంది. ఈ రోజు .. ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆంజాద్ భాషా… మరోసారి రాజీనామా ప్రకటన చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ.. ఎన్డీఏలో చేరాల్సిన అవసరం కానీ తమకు లేదని.. ప్రకటించారు. బొత్స సత్యనారాయణ అలా ఎందుకు చెప్పాడో తెలియడం లేదన్నారు. మరో మంత్రి నారాయణ స్వామి కూడా అదే రీతిలో స్పందించారు.
అయితే.. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో నేతలు.. ఇలాంటి స్పందనను బయటకు వ్యక్తం చేస్తున్నారు. ఓటు బ్యాంక్ కోసం అది ముఖ్యం. కానీ చాలా మంది నేతలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. బీజేపీతో అంతర్గతంగా అవగాహన ఉంటే మంచిదే కానీ.. ఇలా నేరుగా పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓటు బ్యాంక్ దూరమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఏలో చేరే విషయంపై.. వైసీపీలో చర్చ పెరిగే కొద్దీ.. ఈ ఆందోళనలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీన్ని హైకమాండ్ ఎలా సద్దుమణిగేలా చేస్తుందో చూడాలి..!