ఇంగ్లిష్ మీడియం విషయంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై జగన్మోహన్ రెడ్డి.. అధికారిక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయా..?. ఉపరాష్ట్రపతికి రాజకీయ దురుద్దేశం అంటగడుతూ.. జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన సూచనలు రావడంతో.. ప్రత్యేకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వెంకయ్య పట్ల జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరమని.. ఉప రాష్ట్రపతి వెంకయ్యకు సీఎం జగన్ తక్షణం క్షమాపణ చెప్పాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో వెంకయ్య పాత్ర మరువలేనిది..ఆయన ఏ పదవిలో ఉన్నా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తారన్నారు. రాజ్యాంగ పదవుల్లో పెద్దల పట్ల ఇలా మాట్లాడటం మంచిపద్దతి కాదని హెచ్చరించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు … ఇంగ్లీష్ మీడియాన్ని తీవ్రంగా వ్వతిరేకించారని .. ఎన్నో ఉద్యమాలు చేసి తెలుగుభాషకు ప్రాచీనహోదా తెచ్చుకున్నామన్నారు. మాతృభాషను చంపుతామంటే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై.. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో ఢిల్లీకి పాకిపోయాయి. ఇంత వరకూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవుల్లో ఉన్న వారిపై.. రాజకీయ ఆరోపణలు ఎవరూ చేయలేదు. చేసే సాహసం కూడా చేయరు. వారికి రాజకీయ దురుద్దేశాలు అంటగట్టడం అసలు చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి… మాత్రం.. రెండు రోజులుగా.. వెంకయ్య నాయుడు.. తెలుగు భాష గొప్పదనం గురించి ఆర్టికల్స్ రాయడం… తాను పాల్గొన్న కార్యక్రమాల్లో ప్రస్తావించడాన్ని తట్టుకోలేకపోయారు. దాన్నే రాజకీయ దురుద్దేశంగా భావించి.. విమర్శలు చేసేశారు. ఇదే ఢిల్లీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
నేషనల్ ప్రెస్ డే కార్యక్రమంలో.. వెంకయ్య పాల్గొంటారని తెలిసి.. జగన్ అసలు ఆ కర్యక్రమాన్ని నిర్వహించడానికి ఇష్టపడలేదన్న విషయం కూడా… కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.