ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా తెలుసు. అందుకే వారు ఓటేయకుండా పక్కా కుట్రలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కొత్త కొత్త నిబంధనలు పెట్టి.. వారికి పోస్టల్ బ్యాలెట్ అందకుండా చేస్తున్నారు.
మూడు లక్షలకుపైగా ఓట్లు వేయకుండా చూసే కుట్రలు
పోలింగ్ విధుల్లో మూడు లక్షల 30 వేల మంది వరకూ పాల్గొంటున్నారు. వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఈసీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సిబ్బంది దరఖాస్తు కోసం ఈ నెల 22 వరకూ గడువు ఇచ్చింది. దరఖాస్తులు ఇచ్చారు కానీ.. వాటిని సమర్పించే విషయంలో మాత్రం అధికారులు మాకు కాదు..మాకు కాదు అని గందరగోళం సృష్టించి ఎవరూ తీసుకోవడం లేదు. ఫలితంగా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలనకుంటున్న పోలింగ్ సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.
ఈసీ రూల్స్ కు కొత్త భాష్యం చెప్పుకున్న ఏపీ అధికారులు
పోలింగ్ సిబ్బందికి శిక్షణ సమయంలో పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు. వివరాలు నింపిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. తర్వాత వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో ఇవ్వాలంటూ ఫాం 12 ఇచ్చారు. ఉద్యోగులు వివిధ కారణాలతో తాము పని చేస్తున్న చోట కాకుండా ఇతర చోట ఓటు హక్కు కలిగి ఉంటారు. అయినప్పటికీ చాలా మంది తమ ఫాం 12 తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారులకు ఇస్తూంటే.. తమకు కాదని.. ఫాం 12 ఎవరు ఇచ్చారో వారికే ఇవ్వాలని అంటున్నారు. తీసుకోవడం లేదు. దీంతో గందరగోళం ఏర్పడింది.
పట్టించుకోని ఈసీ
సాధారణంగా నిబంధనల ప్రకారం ఓటు హక్కు ఉన్న మండలంలో ఫాం 12 సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అందరూ ఒకరిపై ఒకర చెప్పుకుని పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవడం లేదు. గడువు ఈ నెల 22 వరకే ఉండటంతో.. వాటిని ఎవరికి సమర్పించాలో తెలియక చాలా మంది పోలింగ్ సిబ్బంది సతమతముతున్నారు. ఫాం 12 సమర్పిస్తేనే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. వైసీపీకి సన్నిహితంగా ఉండే ఆర్వోలు ఈ కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యపై ఇంకా స్పందించలేదు. స్పందించకపోతే లక్షల మంది ఉపయోగించుకునే పోస్టల్ బ్యాలెట్లు నిరుపయోగమవుతాయి. ఎన్నికలు నిర్వహించే సిబ్బంది ఓటు హక్కును నిరాకరించినట్లు అవుతుంది.