కోర్టులపై కుట్రలు చేసి.. న్యాయమూర్తుల్ని బ్లాక్మెయిల్ చేసేందుకు.. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ప్రయత్నిస్తున్నారంటూ.. చిత్తూరు జిల్లాకు చెందిన రామకృష్ణ అనే సస్పెన్షన్లో ఉన్న న్యాయమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈశ్వరయ్య తనకు ఫోన్ చేసి… మాట్లాడిన సమాచారాన్ని.. ఆడియో టేపును ఆయన హైకోర్టుకు సమర్పించారు. ఆ ఆడియో టేపును మీడియాకు విడుదల చేసింది. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈశ్వరయ్య.. తాను అధ్యక్షుడిగా ఉన్న ఓ కుల సంఘం పేరు మీద.. హైకోర్టు మీద నిందలు వేస్తూ.. ఓ లేఖను రాష్ట్రపతికి పంపారు. దానిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా రామకృష్ణ .. ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన రామకృష్ణ… ఎనిమిదేళ్లుగా సస్పెన్షన్లో ఉన్నారు. ఆయనకు .. హైకోర్టులో న్యాయమూర్తిగా చేసి పదవి విరమణ చేసిన జస్టిస్ నాగార్జున రెడ్డికి మధ్య వివాదం ఉంది. రామకృష్ణ ఫిర్యాదు మేరకు గతంలో నాగార్జునరెడ్డిపై అభిశంసన ప్రక్రియ కూడా కొంత మందుకు నడిచింది. తర్వాత ఆయన రిటైరయ్యారు. మంత్రి పెద్దిరెడ్డికి.. నాగార్జున రెడ్డికి.. జగన్మోహన్ రెడ్డికి మధ్య బంధుత్వం ఉంది. ఇటీవలి కాలంలో మళ్లీ రామకృష్ణపై దాడులు పెరిగాయి. కొత్త కేసులు కూడా పెట్టారు. అయితే.. అనూహ్యంగా ఈశ్వరయ్య ఆయననే ఉపయోగించుకుని… కోర్టులను లైన్లోకి తేవాలని ప్రయత్నించినట్లుగా.. బయటకు రావడం కలకలం రేపుతోంది.
రామకృష్ణకు అన్ని విధానాలుగా న్యాయం చేస్తానని ఈశ్వరయ్య భరోసా ఇచ్చి… న్యాయమూర్తులపై ఆరోపణలు చేయించడానికి ప్రణాళికలు వేసినట్లుగా… ఆడియో టేపుల్లో ఉన్నదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని.. నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ గా ఈశ్వరయ్య ఉన్నారు. తెలంగాణకు చెందిన ఈయన . ..ఎన్నికలకు ముందు కుల సంఘం పేరుతో ఏపీలో రాజకీయాలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి పొందారు. ఇప్పుడు తన మాజీ న్యాయమూర్తి హోదాను అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థనే… వైసీపీ అధినాయకత్వానికి అనుకూలంగా బ్లాక్మెయిలింగ్ చేసేందుకు వాడుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఇప్పటికే న్యాయవ్యవస్థపై అనేక రకాలుగా దాడికి దిగుతోంది. న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని కించ పరుస్తోంది. సోషల్ మీడియాలో దారుణమైన ప్రచారాన్ని చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారితో ఆరోపణలు చేయించారు. ఇప్పుడు మరో మార్గంలో.. వెళ్తున్నట్లుగా ఈశ్వరయ్య ఉదంతంతో బయటపడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.