పట్టాలెక్కుతున్న అమరావతిని ఆపేందుకు కొత్త కొత్త ఆయుధాలతో ముందుకు రావాల్సిన కుట్రదారులు పాత విరిగిపోయిన పాత కత్తులతోనే కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతికి రుణం ఇవ్వవద్దని చెప్పి తాజాగా లేఖలు రాస్తున్నారు. ఈ మెయిల్స్ పంపుతున్నారు. అసలు ఎవరికీ తెలియని హక్కుల సంఘాలు, ఉద్యమసంఘాలు, రైతుల సంఘాల పేరిట ఈ లేఖలు పోతున్నాయి. ఎక్కడి నుంచి పోతున్నాయో.. ఎవరు చేయిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. కానీ గతంలోనే ఇదంతా చేశారు.. కొత్తగా చేసేదేంటి? అన్న ఆలోచన మాత్రం చేయలేకపోతున్నారు.
గతంలో అమరావతికి రుణం ఆలస్యం కావడానికి కారణం ఇలాంటి ప్రయత్నాలే. ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ప్రపంచబ్యాంక్ బృందం వచ్చి విచారణ జరిపింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తమ వద్ద బలవంతంగా భూమి తీసుకున్నారని కానీ.. మరో ఫిర్యాదు కానీ చేయలేదు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు సిద్దపడిన సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ రుణం వద్దనుకుంది. అమరావతినే ఆపేస్తాం కాబట్టి ఆ రుణం అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు మళ్లీ రుణం మంజూరు అయింది. సంతకాలు కూడా అయిపోయాయి. అయినా అవే ప్రయత్నాలు చేస్తున్నారు.
సొంత రాష్ట్రం మీద కుట్రలు చేసుకునే వాళ్లుఉండటం.. సొంత రాష్ట్ర రాజధాని మీద దాడులు చేసే వాళ్లు ఉండటం ఆంధ్రుల దౌర్భగ్యమే కానీ.. అదే జరుగుతోంది. ప్రజాభిప్రాయాన్ని కూడా గుర్తించకుండా ఇలాంటి పనులు చేసి పాతాళానికి పడిపోయారు. చివరికి తమపై మట్టి పోసి కప్పెట్టేదాకా ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు.