ఏపీలో ఓ మంత్రి హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ అడ్డాగా సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎవరు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఆ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని టీడీపీ వర్గాలు అనుకుంటున్నారు. ఆయన బస చేసే హోటల్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉండే ఐటీసీ కోహినూర్ అని.. వారంలో మూడు రోజులు అక్కడే ఉండి దందా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
రెవిన్యూ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ రెండు రోజులు మాత్రమే తన శాఖ కార్యకలాపాల కోసం అమరావతిలో ఉంటారట. తర్వాత రెండు రోజులు నియోజకవర్గానికి సమయం కేటాయిస్తారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే వీకెండ్ కోసం ఆయన హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ కు చేరుకుంటారు. రెవిన్యూ మంత్రిగా ఆయనకు చాలా పవర్స్ ఉంటాయి. ఈ క్రమంలో ఐటీసీ కోహినూర్ లో దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బిజినెస్ పార్టనర్ అయిన వ్యక్తి షాడో మినిస్టర్ గా ఉండి ఈ వ్యవహారాలు చక్క బెడుతున్నారని చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి నిఘా వర్గాలు ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి పంపాయని.. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని వివరాలు సేకరించిందని చెబుతున్నారు. అనగాని సత్యప్రసాద్ కు తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఆయన లావాదేవీలను గుప్పిటపట్టి అప్పటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయనే ఇబ్బందిపెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఏపీలో రెవిన్యూ సమస్యలు పెద్ద ముప్పుగా మారాయి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవిన్యూ సదస్సులు పెడితే లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. చంద్రబాబు కూడా ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. అయితే ఆయన రెండు రోజులు మాత్రమే పని చేసి.. హైదరాబాద్ చిల్ అవుతూంటే ఎలా పరిష్కారమవుతాయని ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి.