వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల సోనియా గాంధీ రాహుల్ గాంధీ లను కలిసిన సంగతి, తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడానికి శత విధాల ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గతంలో సోనియా గాంధీ తదితరుల పై వైయస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి మరియు వైయస్సార్ తనయ షర్మిల తో పాటు ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు తెరమీదకు తీసుకొని వస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి కి వెళ్తే..
వైయస్సార్ మరణం వెనుక కుట్ర అని అప్పట్లో జగన్ కుటుంబం చేసిన ప్రచారం:
హెలికాప్టర్ క్రాష్ లో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయంగా పలు మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. వైయస్సార్ మరణం అనంతరం ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి సొంత కుంపటి పెట్టుకొని ఆ తర్వాత పలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. దీనికి ఒక కారణం అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అయితే రెండవ ప్రధాన కారణం వైయస్సార్ మరణానంతరం ప్రజల్లో జగన్ కుటుంబం పై వచ్చిన సానుభూతి వెల్లువ. అయితే జగన్మోహన్ రెడ్డి సొంత కుంపటి పెట్టిన కొత్త లో వైయస్సార్ ది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆ పార్టీ నేతలు బలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
2011 ఆగస్టులో అంబటి రాంబాబు వంటి నేతలు వైయస్సార్ మరణం వెనకాల కుట్ర కోణం ఉందని తాము బలంగా నమ్ముతున్నామని ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత పలు సందర్భాలలో జగన్ మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల తో పాటు విజయమ్మ కూడా వైయస్సార్ మరణం వెనకాల కుట్ర దాగుందని తాము బలంగా అనుమానిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. వీరి వ్యాఖ్యలు అన్నీ కూడా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరియు వారి కుటుంబం వైపు ఎక్కుపెట్టేలా ఉండేవి అన్న సంగతి విదితమే. ఇక మరొక సందర్భంలో ఈ కుట్ర వెనకాల రిలయన్స్ అధినేత హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది అంటూ సాక్షిలో సైతం ఒక కథనం రావడంతో వైయస్సార్ అభిమానులు కొందరు తమ తమ ఊళ్ళలోని రిలయన్స్ మార్ట్ లపై దాడులు కూడా చేసిన సంగతి బహుశా చాలామందికి గుర్తుండే ఉండవచ్చు. 2022 సెప్టెంబెర్ లో తెలంగాణ పాద యాత్ర లో సైతం షర్మిళ తన తండ్రి మరణం వెనుక కుట్ర ఉందన్న ఆరోపణలు చేసారు.
అదే సోనియాగాంధీ కరుణ కోసం ఇప్పుడు షర్మిల చేస్తున్న ప్రయత్నాలు, గందరగోళానికి గురవుతున్న వైయస్సార్ అభిమానులు :
ఈ విషయాలన్ని కాల క్రమంలో తెర మరుగైపోయాయి. అయితే ఇప్పుడు వైయస్ షర్మిల సోనియా గాంధీతో భేటీ కావడం, తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉండడం – వైయస్సార్ ని బలంగా అభిమానించే ఒక వర్గం ప్రజలకు మింగుడు పడడం లేదు. పెద్దాయన చనిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు ఏదో ఒక రూపంలో వైయస్సార్ మరణం వెనకాల కుట్ర ఉందని అంటూ అన్యాపదేశంగా సోనియాగాంధీ కుటుంబాన్ని దీనికి బాధ్యులుగా చేస్తూ జగన్ కుటుంబం చేసిన ప్రచారాన్నంతా నిజంగానే నమ్మిన ఆ వర్గం అభిమానులకు షర్మిల ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు ఏవీ మింగుడు పడడం లేదు. దీంతో అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన “వైయస్సార్ మరణం వెనుక కుట్ర” అన్న ప్రచారం మొత్తం ఉత్తుత్తిదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అప్పటి ప్రచారమే గనక నిజం అయి ఉంటే ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం షర్మిల తన తండ్రి మరణం వెనుక కుట్రలో భాగస్వాములైన వారి చెంతకు వెళ్లడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒకరకమైన గందరగోళం వైయస్సార్ అభిమానుల్లో కనిపిస్తోంది.
మరి ఒకవేళ కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేస్తే వైయస్సార్ మరణం వెనుక కుట్ర ఉందని అప్పట్లో తాము చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అన్నది వేచి చూడాలి