రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమౌతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజ్యసభలో ఆయన వ్యవహరిస్తున్న తీరు, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అడ్డుపడుతుండటం సరికాదన్న వాదనను కొన్ని పార్టీ వ్యక్తం చేస్తున్నాయి. సభలో కీలకమైన అంశాలపై చర్చను లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నది కొన్ని పార్టీల తీవ్ర అసంతృప్తి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తోపాటు, ఎస్పీ, టీఎంసీతోపాటు మరికొన్ని పార్టీలకు చెందిన నేతలు త్వరలోనే ఇదే అంశమై భేటీ కాబోతున్నట్టు వినిపిస్తోంది.
తాజాగా అసోంలో 40 లక్షమందిని భారతీయులు కాదంటూ జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాము చర్చించాలని భావిస్తే, వెంకయ్య నాయుడు అనుమతించలేదన్నది ఆ రాష్ట్ర ఎంపీలు తీవ్ర అసంతృప్తి. అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు తరువాత భాజపా అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న కొన్ని సహాకార బ్యాంకుల్లో భారీ డిపాజిట్ల అంశమై కూడా చర్చకు వెంకయ్య అనుమతి ఇవ్వలేదనేది ఇంకొందరి సభ్యుల అభ్యంతరంగా తెలుస్తోంది. పెద్ద నోట్లు రద్దు, కుదేలౌతున్న ఆర్థిక వ్యవస్థ, మూక దాడులు, బోఫోర్స్ వంటి కీలక అంశాలు లేవనెత్తేందుకు ప్రయత్నిస్తే.. ఆయన ముందుగానే దాన్ని పక్కతోవ పట్టించేస్తున్నారనేది మరికొందరి అభిప్రాయం.
మోడీ ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా ఉన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ… సర్కారుకు ఇబ్బంది కలిగించేవాటిని వీలైనంత త్వరగా ముగించే విధంగా రాజ్యసభ ఛైర్మన్ తీరు ఉంటోందనేది కొన్ని పార్టీల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇలాంటి అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి ఒక లేఖను సిద్ధం చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. వర్షాకాల సమావేశం ప్రారంభంలోనే దీనిపై ఆలోచన మొదలైందనీ, ప్రస్తుతం ముసాయిదా తయారౌతోందనీ, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత ఇతర పార్టీలు భేటీ కాబోతున్నట్టు సమాచారం.
నిజానికి, అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడిగా వెంకయ్యకు మంచి పేరుంది. ఉప రాష్ట్రపతి కాకముందు ఆయనకు ఉన్న ఇమేజ్ ఇదే. అయితే, రాజ్యసభ ఛైర్మన్ అయిన తరువాత పార్టీకి కట్టుబడి కొంత వ్యవహరించాల్సిన అనివార్యత ఏర్పడిందన్న అభిప్రాయాన్నీ కాదనలేం! సభాపతి స్థానంలో కూర్చున్నారు కాబట్టి.. ఇతర పార్టీలన్నీ ఇలాంటి అంశాలు మరింత స్పష్టంగా గమనిస్తాయి కదా. మరి, ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో వేచి చూద్దాం.