కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ బియ్యం స్మగ్లింగ్ గురించే అందరూ చెప్పుకుంటున్నారు. కానీ అసలు పోర్టే వైసీపీ హయాంలో చేతులు మారిపోయింది. ఇందు కోసం ఓ మాఫియా చేసిన ప్రయత్నాలపై ఎన్నో రకాల ప్రచారాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలోకి రాక ముందు అరబిందో అనే కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా పరిశ్రమకే పరిమితం అయింది. ఆ కంపెనీ విజయసాయిరెడ్డి వియ్యంకుడిది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో రియాల్టీ ఏపీలో శరవేగంగా పాతుకుపోయింది. అరబిందో ఫార్మాకు ఈ కంపెనీకి సంబంధం లేదు. లిక్కర్ స్కాంలో అరబిందో వారసుడు .. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టు కావడంతో వాటాదారులు గొడవ చేశారు. దాంతో అరబిందో రియాల్టీ పేరును మరో రియాల్టీ అని మార్చారు. కానీ అరబిందో రియాల్టీగా ఉన్నప్పుడే ఈ సంస్థ కాకినాడ పోర్టును రాయించేసుకుంది.
కాకినాడ పోర్టు పూర్వ యజమానులను తుపాకీ పెట్టి బెదిరించి అణాకాణీలకే నలభై శాతానికిపైగా వాటా రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్నో సార్లు వీటిపై వార్తలు వచ్చినా ఎవరూ ఖండించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ అంశం తెరపైకి వస్తోంది. కాకినాడ పోర్టు ఎలా చేతులు మారింది.. చేతులు మారిన తర్వాత స్మగ్లింగ్ కు ఎలా కేంద్రంగా మారింది… అసలు ఔరో రియాల్టీకి అసలు యజమాని ఎవరు ఇవన్నీ వెలుగులోకి తేవాలని అనుకుంటున్నారు. బియ్యం స్మగ్లింగ్ పై చేసే విచారణలో వీటిని బయటకు తీసుకొచ్చేలా చేస్తే.. అసలు మాఫియా గుట్టు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.