స్వయం కృతాలతో కటకటాలపాలై కోర్టు బోనులో నుంచున్న గజల్ శ్రీనివాస్‌కు మద్దతుగా కొన్ని వర్గాలు వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదట బలపర్చిన మంత్రి మాణిక్యాల రావు సర్దుకున్నారు గాని ఇంకొందరు మాత్రం మరింత గట్టిగా కొమ్ముకాస్తున్నారు. టీవీలలో చర్చలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఆ అమ్మాయి కుట్ర పన్ని అతన్ని పట్టించిందనేది వారి ప్రధాన వాదన. మరెవరో పనిమనిషితో ఆయన వుండే దృశ్యాలు బయిటపెట్టి బదనామ్ చేస్తున్నదే గాని ఆమె ఎక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు.నిజానికి బాధితురాలు ఈ మాట తనే చెప్పింది. ఒక్కసారి కాళ్లు పట్టుకోవడం కూడా రికార్డు కోసమేనని స్పష్టం చేసింది. తనను చాలా సార్లు పనిమనిషి ద్వారా ఒత్తిడి పెట్టినట్టు తెల్పింది. వీటికి సంబంధించిన విడియోలు కూడా పోలీసుల దగ్గర వున్నాయని సమర్థకులు తెలుసుకోవడం మంచిది. సమయం వచ్చినప్పుడు వాటిని వెల్లడి చేయొచ్చు. ఫోరెన్సిక్ నుంచి రాగానే కోర్టుకు సమర్పించవచ్చు. ఇన్ని విడియోలు వున్నాయని తెలియక మొదట బింకం చూపిన గాయకుడు తర్వాత గప్చిప్ అయిపోయారు.కాని ఈ వీర సమర్థకులకు ఆ సంగతి తెలియడం లేదు. ఇంతకూ కుట్ర ఏమిటి అంటే నాలుగు సిద్ధాంతాలు. 1. షరా మామూలుగా కులం.గజల్, ప్రదీప్ ఇద్దరూ అగ్రకులస్తులే గనక ఇతరుల కుట్ర 2. డ్రగ్స్‌తో మొదలుపెట్టి ప్రాంతీయ కుట్ర 3. హైదరాబాద్ శివార్లలో వచ్చే రామానుజ విగ్రహ ప్రతిష్టాపన అంబాసిడర్‌గా ఆయన నియమితులవడం ఇష్టంలేని ఆశ్రమ మాఫియాకుట్ర 4. తనకు గాక అతనికి పద్మశ్రీ వస్తుందని కక్ష కట్టిన ఒక మీడియాధిపతి కుట్ర. తాడూ బొంగరం లేని ఈ కుట్ర సిద్ధాంతాలు చాపకిందనీరులా ప్రచారం చేస్తున్నారు గాని ఇవి విచారణ నుంచితప్పించలేవని తెలుసుకోవాలి. ఎందుకంటే విడియోలలో అనేకం బయిటకు రాలేదు.ఇప్పటికి చూపిస్తున్నవే భరించలేనివిగా వుండటంతో తక్కినవి పక్కనపెట్టారు. తగు సమయంలో అవీ రావచ్చు..మిగిలినవన్నీ ఆరోపణలు కావచ్చు గాని ఆయనే కనిపిస్తున్న దృశ్యాలు నిజం కాదని ఎలా అనగలరు? ఇక పోతే గతంలో ఒక పండితుల వారిలాగే ఈయన కూడా నిక్షేపంగా బయిటకు వచ్చి మామూలుగా బతికేస్తారని పెద్దగా ఆందోళన అక్కర్లేదని మరో ప్రచారం. ఏది ఏమైనా జరిగిన దానికి విచారించి తప్పులు దిద్దుకోవడం ముఖ్యం గాని సమర్థించుకోవడం వల్ల ఇతరులను నిందించడం వల్ల ఫలితం వుండదు