ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేస్తామని నేరుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకే మెయిల్ చేశారు దుండగులు. ఈ విషయాన్ని ఎన్ఐఏ వెంటనే ప్రధాని భద్రతావ్యవహారాలు చూసి ఎన్ఎస్జీకి పంపించింది. మెయిల్లో తాము ఇరవై కిలోల ఆర్డీఎక్స్ రెడీ చేశామని పలు ఉగ్రవాద గ్రూపులతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. రెండేళ్ల కిందట కూడా ఇలాగే ఎన్ఐఏకు ఓ లేఖ వచ్చింది. అప్పుడు కూడా మోదీని చంపుతామని అందులో పేర్కొన్నారు.
అయితే ఇవన్నీ ఫేక్ లెటర్లన్ని భావిస్తున్నారు. కొంత మంది కావాలనే అలజడి రేపే ఉద్దేశంతోనే ఇలాంటి మెయిల్స్ పంపుతున్నారని అనుమానిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఎన్ఐఏ సీరియస్గా తీసుకుంది. ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది.. దీని వెనుక ఉన్నకథేమిటి అన్న అంశాలపై పరిశోధన చేస్తున్నారు. అయితే రెండేళ్ల కిందట మెయిల్ ఎవరు పంపారన్నదానిపై విచారణ జరిపారో లేదో స్పష్టత లేదు.
మోదీ హత్యకు కుట్రలు తరచూ బయటపడుతూ ఉంటాయి. ఎల్గార్ పరిషత్ కేసులో కూడా మోదీ హత్యకు కుట్ర పన్నినట్లుగా ఆధారాలు లభించాయి. ఆ కేసులో విరసం నేత వరవరరావు చాలా కాలం పాటు జైలులో ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ప్రధాని భద్రత అత్యంత కీలకం కాబట్టి ఏ చిన్న విషయాన్ని భద్రతా వర్గాలు వదిలి పెట్టడం లేదు.